ఏపీలో స్థానిక ఎన్నికలపై కరోనా ఎఫెక్ట్ పడింది. మున్సిపల్ సహా స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఆరు వారాల పాటూ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ యధాతథంగా ఉంటుందని ప్రకటించింది ఈసీ.

 

కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌ ఏపీలో ఎన్నికలపై పడింది.  వైరస్ వ్యాప్తి జరుగకుండా చర్యలు తీసుకుంటున్న కేంద్రం...కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించడంతో...స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది ఈసీ. ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ ప్రకటించారు. అయితే ఇప్పటివరకూ జరిగిన ఎన్నిక ప్రక్రియ యధావిథిగా ఉంటుందని, కేవలం జరగాల్సిన ఎన్నికలు మాత్రమే వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వాయిదా ప్రక్రియ ముగిసిన తర్వాత సమీక్ష నిర్వహించి పంచాయితీల షెడ్యూల్ ప్రకటించనున్నారు. 

 

జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారని ఈసీ స్పష్టం చేసింది. ఏకగీవ్రంగా ఎన్నికైన వారు ఎన్నికల్లో గెలిచిన వారితో కలిసి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల నియామవళి యధావిధిగా కొనసాగనుంది. ఈ ఎన్నిక ప్రక్రియ నిలిపివేత మాత్రమేనని, రద్దు కాదనే విషయాన్ని రమేష్‌ కుమార్‌ తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడటం వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఈసీ అభిప్రాయపడింది. అందుకే ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటూ నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

 

ఇక గొడవలు జరిగి ఏకగ్రీవమైన వాటిని సమీక్షిస్తామని ఈసీ తెలిపింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఎస్‌ఈసీ చర్యలు తీసుకుంది. టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నలపై దాడి ఘటనలో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చినందుకు మాచర్ల సీఐని సస్పెండ్ చేశారు. ఇక చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు, గుంటూరు రూరల్, తిరుపతి అర్బన్ ఎస్పీలను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
వీరితో పాటూ పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలను, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలపై బదిలీ వేటు వేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: