శ్రీకాకుళం జిల్లా మత్తు పదార్థాల అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. ఇక్కడి నుంచి గంజాయిని అక్రమంగా పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు నివ్వెరపోయే నిజాలు తెలిశాయి. వాటర్‌ ట్యాంకర్‌లలో భారీ ఎత్తున గంజాయి తరలించటం జిల్లాలో కలకలం రేపుతోంది. పోలీసులు ఈ స్థాయిలో దాడులు చేస్తున్నా...జిల్లాలో ఏదో ఓ చోట మత్తు పదార్థాలు పట్టుబడటం సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ...సిక్కోలులో మత్తుపదార్థాల అక్రమ రవాణా కట్టడి చేసే ఛాన్స్ ఉందా?

 

సిక్కోలు జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జిల్లాలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓ ట్యాంకర్‌లో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. విశాఖ నుంచి ఒడిశా వైపు వెళ్తున్న ట్యాంకర్‌ను చెక్‌ చేశారు. ట్యాంకర్‌లో లక్షలాది రూపాయల విలువైన గంజాయి ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం గొర్లెపాడు వద్ద పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో ఈ గంజాయి బయటపడింది. పైకి చూడటానికి ట్యాంకర్ లాగే ఉన్నప్పటికీ అందులో పాలిథిన్ కవర్లలో గంజాయిని ప్యాకింగ్ చేశారు. ఆ ప్యాకెట్లను పరిశీలించిన పోలీసులే షాక్ తిన్నారు. ట్యాంకర్ నిండా ఉన్న ప్యాకెట్లను గంజాయితో నింపేశారు. 

 

ఇక...దీంతో అలర్ట్ అయిన పోలీసులు...ట్యాంకర్‌తో పాటు అందులో ఉన్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ట్యాంకర్ లోపల భద్రంగా అమర్చిన గంజాయి ప్యాకెట్లను బయటకు తీసి లెక్కించారు. రెండేసి కేజీల బరువు చొప్పున 14 వందల 9 ప్యాకెట్లు ఉన్నాయి. ఇందులో 2 వేల 8 వందల 18 కేజీల గంజాయి ఉన్నట్లు తేల్చారు. పట్టుబడ్డ ఈ గంజాయి విలువ సుమారు 35 లక్షలు ఉంటుందని పోలీసుల అంచనా. ఐతే...ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ గంజాయి విలువ కోటికి పైగానే ఉంటుందని భావిస్తున్నారు. 
మొత్తానికి...శ్రీకాకుళం జిల్లాలో ఈ స్థాయిలో గంజాయి పట్టుబడటం కలకలం రేపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: