ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాతో టీడీపీ, వైసీపీ మధ్య  డైలాగ్ వార్ మొదలైంది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్.. టీడీపీకి అనుకూలంగా ఎన్నికను వాయిదా వేశారంటూ ఫైరయ్యింది వైసీపీ. దీనిపై సీఎం జగన్ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అయితే జగన్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు చంద్రబాబు. ఏపీ సీఎం ఆరోపణలను ఖండించారు. మరోవైపు నేతల ఆరోపణలపై వివరణ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్.

 

 

కరోనా ప్రభావంతో... ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. కేంద్రం జాతీయ విపత్తుగా కరోనాను ప్రకటించడంతో... త్వరలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్. ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నామని, ఆ తర్వాత సమీక్ష నిర్వహించి కొత్త తేదీలను నిర్ణయిస్తామన్నారు. నామినేషన్ల సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన చిత్తూరు, గుంటూరు జిల్లాల ఎస్పీలను బదిలీ చేసినట్లు తెలిపారు.

 

కరోనా సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై మండిపడ్డారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు దగ్గరుండి వ్యవస్థలను నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. సీఈసీ రమేష్‌ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు. ఎన్నికలు వాయిదా వేశామని చెబతూనే.. అధికారులను తప్పిస్తున్నామని ప్రకటించడంపై మండిపడ్డారు. ఎన్నికలు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇంటిపట్టాలను ఆపాలనడం ఏంటని ప్రశ్నించారు.

 

ఎవరిని సంప్రదించి ఎన్నికలు వాయిదా వేశారని ప్రశ్నించారు. ఈ ఘటనపై గవర్నర్ బిశ్వభూషన్ ను కలిసి ఫిర్యాదు చేశారు జగన్. 

 

 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడాన్ని తప్పుబట్టారు వైసీపీ నేతలు బొత్సా సత్యనారాయణ, ఎంపీ విజయసాయి రెడ్డి. క్యాస్ట్ వైరస్ తో ఎన్నికలు వాయిదా పడ్డాయన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. టీడీపీ ఓడిపోతుందన్న భయంతో...కరోనా సాకుగా చూపి ఎన్నికలు వాయిదా వేయించారన్నారు. సీఎం, ఇతర ఉన్నతాధికారులతో సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కరోనా వైరస్ కంటే...ఎన్నికల కమిషనర్ ప్రమాదకరమైన వ్యక్తన్నారు విజయసాయి రెడ్డి. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడడానికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ప్రయత్నించారని ఆరోపించారు.  

 

 

మరోవైపు.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడంపై వివరణ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. జాతీయస్థాయి ప్రతినిధులతో చర్చించిన తర్వాతే...ఎన్నికలను వాయిదా వేశామన్నారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్. దీనిపై రేపు గవర్నర్ ను కలిసి వివరణ ఇస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: