ఉమ్మడి వరంగల్ జిల్లాలో అలజడి మొదలైంది. మావోయిస్టుల కదలికలు పెరిగాయన్న సమాచారంతో గోదావరి పరివాహక ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఛత్తీస్ గఢ్ , మహారాష్ట్రాల నుంచి మావోయిస్టులు ఉమ్మడి జిల్లాలోకి వచ్చారన్న నిఘా వర్గాల సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి తెలంగాణలోకి మావోయిస్టులు వచ్చారన్న ఇంటలిజెన్స్  విభాగాల హెచ్చరికలతో ఉమ్మడి జిల్లా పోలీస్  యంత్రాంగం అలర్ట్ అయింది. మావోయిస్టు యాక్షన్  టీంలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ములుగు, భూపాలపల్లి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో తిరుగుతున్నాయన్న సమాచారంతో అడవులను జల్లెడ పడుతున్నారు పోలీసులు. మహబూబాబాద్  జిల్లా  ఏజెన్సీ ప్రాంతాలైన  కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం మండలాల్లో తనిఖీలు చేస్తున్నారు.

 

రెండుమూడు రోజులుగా వాజేడు, వెంకటాపురం, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, పలిమెల, మహాదేవపూర్ మహాముత్తారం మండలాల్లో పోలీస్  బలగాలు కూంబింగ్  చేస్తున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ప్రతీ ఒక్కరి గుర్తింపుకార్డులను పరిశీలిస్తున్నారు. కొత్త వ్యక్తులను గ్రామాల్లోకి రానివ్వొద్దంటూ హెచ్చరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ తో పాటు ములుగు జిల్లాలోని సమ్మక్క బ్యారేజీల దగ్గర బందోబస్తు పెంచారు. ఎప్పటికప్పుడు డ్రోన్  కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 

 

 

మావోయిస్టులు జిల్లాల్లో ప్రవేశించారని జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తుండటంతో రాజకీయ నాయకులు టెన్షన్ పడుతున్నారు. సాధ్యమైనంత వరకు రాత్రి వేళల్లో గ్రామాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికార పార్టీ నాయకులకు సూచిస్తున్నారు పోలీసులు. ఎవరైనా అనుమానితులు కనబడితే తమకు సమాచారం అందించాలని గ్రామస్తులను కోరుతున్నారు. గుత్తికోయల గూడేల్లోనూ తనిఖీలు చేసి మావోయిస్టులకు సహకరించొద్దని హెచ్చరించారు. మరోవైపు మావోయిస్టు ప్రభావిత మండలాల గ్రామాలను పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. కొత్తవారి కదలిక కన్పిస్తే చాలు తమకు సమాచారమివ్వాలని కోరుతున్నారు. ఏజెన్సీ మండలాల్లో పోలీసుల బూట్ల చప్పుళ్లతో ఎప్పుడేం జరుగుతుందోనని  భయపడుతున్నారు జనం.

మరింత సమాచారం తెలుసుకోండి: