వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను యధావిధిగా నిర్వహించమంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాయటం సంచలనంగా మారింది. ఎన్నికలను ఏకపక్షంగా  వాయిదా వేయటమే సంచలనమైతే దాన్ని తప్పు పడుతూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డకు లేఖ రాయటం మరింత సంచలనంగా మారింది. ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ నిర్ణయాన్ని తన లేఖలో నీలం తప్పు పడుతున్నట్లే అనుకోవాలి.

 

ఎందుకంటే కరోనా వైరస్ ను  బూచిగా చూపించి నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని నీలం తన లేఖలో ప్రస్తావిస్తు ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వంతో  చర్చించి ఉండాల్సింది అనటంలో అర్ధం ఏమిటి ? పైగా కరోనా వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవటం ప్రభుత్వ బాధ్యతగా నీలం ఎన్నికల కమీషనర్ కు గుర్తు చేయటం గమనార్హం. అంటే ఎన్నికలు నిర్వహించటం వరకే ఎన్నికల కమీషన్ బాధ్యత కానీ కరోనా వ్యాధి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎన్నికల కమీషన్ కు లేదని తేల్చి చెప్పటమే.

 

కరోనా వైరస్ ప్రబలకుండా ప్రభుత్వం ఇప్పటికీ వీలైనంత చర్చలు తీసుకున్న విషయాన్ని కూడా నీలం తన లేఖలో ఎన్నికల కమీషనర్ కు గుర్తు చేసింది. ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్నపుడు వాయిదా వేయటం వల్ల జరిగే నష్టాలను కూడా సాహ్ని తన లేఖలో స్పష్టంగా ప్రస్తావించారు. ఎన్నికలను వాయిదా వేయాలనే నిర్ణయాన్ని తీసుకునే ముందు ప్రభుత్వంతో మాట్లాడాల్సిందని నీలం లేఖలో ప్రస్తావించటం గమనార్హం. అంటే ఎన్నికల వాయిదా నిర్ణయం ఏకపక్షమని ఎన్నికల కమీషనర్ కు చెప్పటం తప్ప ఇంకోటి కాదు.

 

ఎన్నికల వాయిదా విషయంలో తన విచక్షణ మేరకు నడుచుకున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించటాన్ని కూడా సీఎస్ తప్పు పట్టారు. విచక్షణ అన్నది నిబంధనలను సక్రమంగా లేనపుడు, సంప్రదాయాలు స్పష్టంగా లేనపుడు మాత్రమే ఉపయోగించాలి. అలాంటిది అవసరమే లేనపుడు ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని విచక్షణ మేరకు తీసుకున్నట్లు చెప్పటంలో అర్ధమే లేదని నీలం రాసిన లేఖలో తేల్చేసింది. మరి తాజాగా నీలం సాహ్ని రాసిన లేఖ విషయంలో  నిమ్మగడ్డ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: