చైనాలో పురుడు పోసుకున్న కరోనా ఫ‌లితంగా ఆందోళ‌న‌క‌ర ప‌రిణామాలు కొన‌సాగుతున్నాయి. ప్రపంచ కర్మాగారంగా ప్రసిద్ధి చెందిన పేరొందిన చైనాలో ఏర్ప‌డిన ఈ మ‌హ‌మ్మారి ఫ‌లితంగా అక్కడి తయారీ రంగం దాదాపుగా మూతబడింది. అన్ని రకాల పరిశ్రమలు స్తంభించిపోయాయి. ఫలితంగా భారత్ సహా దిగుమతులు చేసుకుంటున్న ఎన్నో దేశాలపై ఈ ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా మందుల విష‌యంలో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయంటున్నారు. చైనా నుంచి చౌకగా ముడి సరుకు లభిస్తుండటంతో చాలా దేశాలు అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే కరోనా దెబ్బకు అంతా తలకిందులైంది. దేశీయ పరిశ్రమను ముఖ్యంగా ఔషధ రంగాన్ని కుదేలు చేస్తోంది..

 

కరోనా ధాటికి చైనా అతలాకుతలమైంది. తయారీ నిలిచిపోవడంతో చైనా సైతం ఔషధాల కొరతను ఎదుర్కొంటోంది. దీంతో తమ అవసరాలకే ఆ దేశం తొలి ప్రాధాన్యతను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రోవైపు చైనాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిశ్రమలను మూసివేశారు. అయితే, మ‌ళ్లీ ఇప్ప‌ట్లో తెరవడం సాధ్యమేనా? తెరిచినా అక్కడి నుంచి ముడి సరుకులను ఇక్కడికి దిగుమతి చేసుకోవడంపై ఎలాంటి ఆంక్షలు ఉంటాయి? అన్న అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. దీంతో కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చి చైనాలో సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 

పారసిటమల్‌ వంటి మందుల కొరత లేదని కేంద్రం చెబుతున్నా.. వైరస్‌ బాధితులు ముదిరితే పరిస్థితి ఏంటన్నదానిపై ఆందోళనలు లేకపోలేదు. ఇప్పటికే దేశం నుంచి విదేశాలకు ఔషధ ఎగుమతులపై మోదీ సర్కారు ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ఔషధ ఎగుమతులకు బ్రేకులు పడ్డాయి. ఈ క్రమంలో చైనా పరిస్థితులు మెరుగుపడకుంటే యావత్‌ పరిశ్రమపై తీవ్ర ప్ర భావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బల్క్‌ డ్రగ్‌, ఫార్మా పరిశ్రమ ఉత్పత్తులపై ఏప్రిల్‌ తరువాత ప్రభావం ఉంటుందంటున్న విశ్లేషకులు.. ఇతర దేశాలు ఇచ్చిన ఆర్డర్లపై ఈ పరిస్థితుల ప్రభావం పడవచ్చని అంటున్నారు. అత్యవసరాల కోసం ముడి సరుకు సిద్ధంగా ఉందని పరిశ్రమ చెప్తుండగా, వచ్చే నెలలోనూ వైరస్‌ ఉధృతి కొనసాగితే కష్టాలు తప్పవన్న సంకేతా లు అందుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: