ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయ తెర‌పై ఇప్పుడు మంత్రి  పువ్వాడ అజ‌య్ ఓ వెలుగు వెలిగిపోతున్నారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల‌కు కేంద్ర బింధువుగా మారారు. ఖ‌మ్మం రాజ‌కీయాలు అజ‌య్ చుట్టూ ప‌రిభ్ర‌మిస్తున్నాయంటే అతిశెయోక్తికాదు. జిల్లాలో అటు పార్టీకి..ఇటు ప్ర‌భుత్వానికి ఆయ‌నే పెద‌రాయుడు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు ఐటీ శాఖ‌మంత్రి కేటీఆర్ నుంచి ఫుల్ స‌పోర్టు ఉండ‌టంతో  జిల్లాలో అజ‌య్ మాట‌కు తిరుగు ఉండ‌టం లేదు. ఎమ్మెల్యేలు సైతం మంత్రి మాట‌ను ధిక్క‌రించే సాహ‌సం చేయ‌డం లేదు. ఇదిలా ఉండ‌గా గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో మంత్రిగా ఉన్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే.



తుమ్మ‌ల‌కు ఎమ్మెల్సీగా  కేసీఆర్ ఆవ‌కాశం ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగినా అది నిజం కాలేదు. దీంతో తుమ్మ‌ల భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌కంగా కొన‌సాగుతోంది.  గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో మంత్రి హోదాలో జిల్లా రాజ‌కీయాల్లోనే కాదు..రాష్ట్ర రాజ‌కీయాల‌పైనా త‌న‌దైన ముద్ర‌వేసిన తుమ్మ‌ల ప్ర‌స్తుతం రాజ‌కీయంగా ఎదురీతున్నారు. కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గ‌స్థాయి నేత‌గా ప‌ర్య‌ట‌న‌ల‌కే ప‌రిమిత‌మ‌వాల్సి రావ‌డం గ‌మ‌నార్హం. ఒక్క ఓట‌మితో ఆయ‌న ప‌రిస్థితి ఇప్పుడు త‌ల‌కిందులైంది. అదే స‌మ‌యంలో తుమ్మ‌ల‌కు ఏమాత్రం రాజ‌కీయ ఉనికి లేకుండా చేసే ప‌నిలో పువ్వాడ అజ‌య్‌కుమార్ బిజిబిజీగా ఉన్న‌ట్లుగా పార్టీలో బ‌హిరంగ చ‌ర్చే జ‌రుగుతోంది. ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు కూడా ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి.



 పార్టీ, నామినేటెడ్ ప‌ద‌వుల‌కు, ఇటీవ‌ల జ‌రిగిన డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నిక‌ల్లో తుమ్మ‌ల వ‌ర్గాన్ని పూర్తిగా అజ‌య్ ప‌క్క‌న పెట్టేశారు. పాలేరులోనూ ఎమ్మెల్యే కందాళ ఉపేంద‌ర్‌రెడ్డికి అజ‌య్ అండ‌దండ‌లు అందిస్తుండ‌టంతో తుమ్మ‌ల వ‌ర్గానికి అక్క‌డ కూడా చెక్ ప‌డింది. అధికారం లేక పార్టీలో గౌర‌వ మ‌ర్యాద‌లు ద‌క్క‌క‌పోవ‌డంతో  చాలామంది వ్యాపారులు, తుమ్మ‌ల అనుచ‌రులు అజ‌య్ ప‌క్క‌న చేరిపోతుండ‌టం విశేషం. రాక‌రాక వ‌చ్చిన మంత్రి ప‌ద‌విని త‌న రాజ‌కీయ బ‌లోపేతానికి మంత్రి అజ‌య్ కాస్త గ‌ట్టిగానే వాడుకుంటున్న‌ట్లు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: