తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే దీనిపై తీర్మానం పెట్టి కేసీఆర్ చర్చను ప్రారంభించారు. అన్ని పక్షాల అభిప్రాయం మేరకు తీర్మానాన్ని ఆమోదించనున్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సీఏఏ ఒక మతానికో కులానికో సంబంధించిన అంశం కాదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా సీఏఏపై ఆందోళన వ్యక్తమవుతోందని చెప్పారు. 
 
ఇది 130 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం అని... కేవలం ముస్లింలకు సంబంధించిన సమస్య కాదని పేర్కొన్నారు. ఊళ్లో పంతులు రాసిన జన్మపత్రికే తన బర్త్ సర్టిఫికెట్ అని, సీఎం అయిన తనకే బర్త్ సర్టిఫికెట్ లేదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్లెమెంట్ లో కూడా సీఏఏ బిల్లును వ్యతిరేకించిందని అన్నారు. సీఎం అయిన తన పరిస్థితే ఇలా ఉంటే మహిళలు, కూలీలు, పేదల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సీఏఏను, ఎన్నార్సీని స్పష్టమైన అవగాహనతోనే తాము వ్యతిరేకిస్తున్నామని వ్యాఖ్యలు చేశారు. 
 
కేంద్రం అమలు చేస్తున్న ఇలాంటి చట్టాలు దేశ ప్రతిష్టను దిగజారుస్తాయని అన్నారు. సీఏఏ కారణంగా దేశ ప్రతిష్ట మంటగలుస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యవాదులు, లౌకిక వాదులు సీఏఏపై తమ పద్దతుల్లో నిరసనలు తెలుపుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ చట్టం అనేక అనుమానాలకు, ఆందోళనలకు తావిస్తోందని తెలిపారు. కేంద్రం సీఏఏపై పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 
 
ప్రజలు బతకడం కోసం అనేక ప్రాంతాలకు వలస వెళుతుంటారని.... ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కూలి పనుల కోసం వెళ్లేవాళ్లను సర్టిఫికెట్లు తీసుకొనిరమ్మంటే వారు ఎలా తెస్తారని అన్నారు. తెలంగాణ ప్రజలు కూడా అనేక ప్రాంతాలకు వెళ్లి బ్రతుకుతున్నారని... ఎవరైనా సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడితే పాకిస్తాన్ ఏజెంట్లు, దేశ ద్రోహులు అని అంటున్నారని వ్యాఖ్యలు చేశారు.                

మరింత సమాచారం తెలుసుకోండి: