బీజేపీ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఈరోజు వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవటానికి ఈసీ అనుమతిస్తోందని ఆరోపణలు చేశారు. పోలీసులే విపక్ష పార్టీల అభ్యర్థులను బెదిరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలపై కాళహస్తిలో దాడులు జరిగాయని ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వ్యాఖ్యలు చేశారు. 
 
కరోనా అసలు జబ్బే కాదని జగన్ చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. పారసిటమాల్ తో కరోనా తగ్గుతుందని చెప్పడం విడ్డూరం అని కామెంట్లు చేశారు. వైసీపీ ఎన్నికల కమిషన్ ను కూడా బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. పోలీసులు వైసీపీ ఆఫీసుల నుండి జీతాలు తీసుకుంటున్నారా...? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీస్ వ్యవస్థ ఈ స్థాయికి దిగజారిందంటే... రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా...? లేదా..? అని ప్రశ్నించారు. 
 
హైకోర్టు డీజీపీకీ అక్షింతలు వేసినా పోలీస్ వ్యవస్థలో ఏ మాత్రం మార్పులు రాలేదని అన్నారు. గతంలో చంద్రబాబు ఈసీపై చేసిన ఆరోపణలు తాము తీవ్రంగా ఖండించామని చెప్పారు. ప్రాంతీయ పార్టీలకు ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా పోతుందని వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్రంలో పూర్తిగా రద్దు చేయాలని... కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించినప్పుడే రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని అన్నారు. 
 
సీఎం, ఎన్నికల కమిషన్, డీజీపీ నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగవని అర్థమైపోయిందని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పై దాడులు చేసి ఎన్నికల కమిషనర్ ను కూడా కొట్టే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ రకమైన వాతావరణాన్ని తాను బీహార్ లో కూడా చూడలేదని అన్నారు. నిన్న చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారో ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్ పెట్టి అవే ఆరోపణలు చేశారు. ఇద్దరి మాటలు విన్న ప్రజలు, రాజకీయ విశ్లేషకులు బాబోరి బాటలోనే కన్నా నడుస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: