ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో వైసీపీ క్రియేట్ చేసిన ప్ర‌భంజనం త‌ర్వాత ఆ పార్టీలో ఎక్క‌డా లేని ఉత్సాహం నెల‌కొంది. టీడీపీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు వ‌రుస పెట్టి వైసీపీలోకి జంప్ చేసేస్తున్నారు. కొద్ది రోజుల క్రిత‌మే క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగుకు చెందిన మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోయారు. ఇక చీరాల ఎమ్మెల్యే అయిన క‌ర‌ణం బ‌ల‌రాం చంద్ర‌బాబుకు ఎంత స‌న్నిహితుడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క ర్లేదు. ఆయ‌న కూడా వైసీపీలో అధికారికంగా చేర‌క‌పోయినా ద‌గ్గ‌రుండి మ‌రీ త‌న కుమారుడిని వైసీపీలో చేర్పించారు. బ‌ల‌రాం త‌న‌యుడు క‌ర‌ణం వెంక‌టేష్ వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే.

 

ఇక ఇప్పుడు మ‌రో మాజీ మంత్రి వంతు వ‌చ్చింది. టీడీపీ కీలకనేత, మాజీ మంత్రి గాదె వెంకట్‌రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. గాదె వెంక‌ట రెడ్డి రాజ‌కీయాల్లో చాలా సీనియ‌ర్‌. ప్ర‌కాశం, గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లో ఆయ‌న కీల‌క పాత్ర పోషించారు. టీడీపీలో అవ‌మానాల నేప‌థ్యంలో ఇమ‌డ లేక‌పోతోన్న ఆయ‌న సోమ‌వారం మధ్యాహ్నం 3గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో  వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. గాదెతో పాటు ఆయన కుమారుడు మధుసూధన్ రెడ్డి కూడా వైసీపీలో చేరబోతున్నారు.

 

ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు .. గుంటూరు జిల్లా బాప‌ట్ల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో ఎక్సైజ్‌ మంత్రిగా ఉన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రోశయ్య మంత్రివర్గాల్లో దేవాదాయ మంత్రిగా పనిచేశారు. క‌ర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఏరాసు ప్ర‌తాప‌రెడ్డికి ఆయ‌న స్వ‌యానా వియ్యంకుడు కావ‌డం విశేషం. ఇక టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక ఆ పార్టీలో చేరిన గాదె గ‌త ఎన్నిక‌ల్లో బాప‌ట్ల టీడీపీ సీటు ఆశించారు.

 

ఆ ఎన్నిక‌ల్లో బాప‌ట్ల సీటు ఇవ్వ‌ని చంద్ర‌బాబు ... ఇటీవ‌ల మ‌రోసారి గాదెను ప‌క్క‌న పెట్టేసి వేగేశ‌న న‌రేంద్ర వ‌ర్మ‌కు బాప‌ట్ల ప‌గ్గాలు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలోనే త‌న కుమారుడు రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోస‌మే ఆయ‌న వైసీపీలో చేరుతున్న‌ట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: