చంద్రబాబు నవ్వరని అందరికీ తెలుసు. ఆయన ఎపుడూ సీరియస్ గా ఉంటారు. అందుకే బాబు మీద సెటైర్లు  కూడా  ఉంటాయి. బాబుని చూసి నవ్వవయ్యా అంటూ అప్పట్లో దివంగత సీఎం వైఎస్సార్ అనేవారు. ఇక బాబు అధికారంలో ఉన్నపుడే నవ్వలేదు. విపక్షంలో ఉన్నపుడు ఎలా నవ్వగలరు, అందునా టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా ఉన్న వేళ ఎలా నవ్వగలరు.

 

అయితే బాబు ఇపుడు నిండుగా నవ్వుతున్నాడు. దానికి కారణం జగనే. అవును ఇంతకాలం ఏడిపించిన జగన్ ఇపుడు నవ్వులకూ కారణం అవుతున్నాడు. బాబుకు లోకల్ బాడీ ఎన్నికలతో షాక్ తినిపిద్దామనుకున్న జగన్ ఎన్నికల సంఘం వాయిదా  నిర్ణయంతో బొక్కా బొర్లా పడ్డట్టైంది. దాంతో జగన్ బాధను చూసి చంద్రబాబు నవ్వుతున్నాడు.

 

కరోనా వైరస్ నేపధ్యంలో హఠాత్తుగా వాయిదా పడిన ఎన్నికలను తనకు సావకాశంగా తీసుకోవాలని బాబు అనుకుంటున్నారు. ఇప్పటికి ఒక గండం తప్పింది. ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేయించాలి. ఇదే బాబు ఆలోచన. ఇప్పటికే ఎక్కడికక్కడ టీడీపీ  వైసీపీ వారి దౌర్జన్యాలను వీడియోలుగా తీసింది. వాటితో న్యాయపొరాటానికి దిగింది.

 

ఈ ఆరువారాల వ్యవధిలోగా ఎన్నికలు మొత్తం రద్దు అయ్యేలా తీర్పు వస్తుందని బాబు ఊహిస్తున్నారు. ఏపీలో ఉన్న అన్ని చోట్ల నుంచి వైసీపీ వారి దౌర్జన్యం మీద ఫిర్యాదులు తీసుకురమ్మని బాబు ఆదేశిస్తున్నారు. మరో వైపు ఇదే వరసలో బీజేపీ,  జనసేన కూడా బాబుతో జత కలుస్తున్నాయి.

 

ఇలా మూడు పార్టీలూ కలసి జగన్ మీద మూకుమ్మడి పోరాటానికి దిగిపోతున్నాయి. అటు ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదా వేయడం తమ విజయంగా చెప్పుకుంటున్న టీడీపీ తమ్ముళ్ళు కూడా నిండుగా నవ్వుతున్నారు.మా బాబు రాజకీయ చాణక్యుడు అంటూ కితాబు ఇస్తున్నారు.  ఇది చాలు బాబు మళ్ళీ దూసుకుపోవడానికి. 

 

మరో వైపు 151 మంది ఎమ్మెల్యేలూ, అధికారం ఉండి కూడా జగన్ చేయలేనిది ప్రతిపక్షంలో ఉండి బాబు చక్రం తిప్పుతున్నారు. మొత్తానికి బాబు నవ్వుతున్నారు. ఆయన ఇలా ఉన్నారంటే మళ్ళీ అధికార పక్షానికి కొత్త ఇబ్బంది మొదలైపోయినట్లే. అదేంటో చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: