కాఫీ డే.. ఈ పేరు తెలియని భారతీయులుండరు. ఈ మధ్యే కేఫ్ కాఫీ డే ఓనర్ సిద్ధార్థ అర్ధాంతరంగా తనువు చాలించి సంచలనానికి కారణమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్యపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాఫీ డే ఖాతాల నుంచి 2 వేల కోట్ల రూపాయలు అదృశ్యమైనట్లు తేలింది.. ఇంతకూ ఆ సొమ్ము ఏమైంది..? ఎక్కడికి వెళ్లింది...?

 

కేఫ్‌ కాఫీ డే సృష్టికర్త వి.జి.సిద్ధార్థ గతేడాది జులై 31వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌గా పేరుగాంచిన సిద్ధార్థ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అయితే తాను మాత్రం ఫెయిల్యూర్‌ బిజినెస్‌మ్యాన్ అని, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం లేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. ఆయన్ను ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.. ఈ విచారణలో అనేక సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తోంది.

 

కేఫ్ కాఫీ డే బ్యాంక్‌ ఖాతాల నుంచి దాదాపు  2వేల కోట్ల రూపాయలు అదృశ్యమైనట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌ ఓ కథనం వెల్లడించింది. ఈ దర్యాప్తు నివేదికను కాఫీ డే బోర్డు త్వరలోనే బహిర్గతం చేయనున్నట్లు తెలుస్తోంది. సిద్ధార్థ మరణం తర్వాత ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. తన లావాదేవీల గురించి బోర్డుకు గానీ, ఆడిటర్లకు గానీ ఏమాత్రం సమాచారం లేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుగుతోంది. ఇందులో దాదాపు  2వేల కోట్ల రూపాయలకు లెక్క తేలలేదని తెలుస్తోంది. ఇది 2500 కోట్లకు పైనే ఉంటుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ డబ్బంతా ఏమైందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

 

కాఫీ డే కోసం సిద్ధార్థ వ్యక్తిగత గ్యారెంటీతో పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నారని తెలుస్తోంది. స్థానిక వడ్డీవ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తీసుకున్నట్లు ఈ నివేదిక తెలిపింది. పాత రుణాలకు వడ్డీ కట్టడం కోసం కొత్త రుణాలు తీసుకోవడంతో అప్పులు పేరుకుపోయాయి. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల నివేదిక ప్రకారం.. సిద్ధార్థ లిస్టెడ్‌, ప్రైవేటు కంపెనీల మొత్తం రుణాల విలువ 10వేల కోట్లకు పైనే ఉందని తేలింది.. ఈ రుణాలు తిరిగి చెల్లించలేక సిద్దార్థ చాలా సతమతమయ్యేవారని తెలిసింది. అంతటి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కంపెనీ నుంచి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా మాయమైందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సిద్ధార్థ మరణం తర్వాత కాఫీ డే వ్యాపారం బాగా దెబ్బతింది. కంపెనీ షేర్లు కూడా 90శాతానికి పైగా పడిపోయాయి.. దీంతో ఫిబ్రవరిలో ట్రేడింగ్‌ నిలిపివేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: