ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. అమెరికా కరోనా సోకిన వారి సంఖ్య 2100కి చేరుకున్న‌ది.  48 మంది మ‌ర‌ణించారు. నోవెల్ క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో అగ్ర‌రాజ్యం అమెరికా జాతీయ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది. వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడిన అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని అన్నారు.  నేష‌న‌ల్ ఎమ‌ర్జెన్సీని అధికారికంగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. మ‌రోవైపు, చైనా-అమెరికాల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది.

 

కరోనా కోవిడ్ వైరస్‌ను వుహాన్ వైరస్ లేదంటే చైనా వైరస్ అని పిలుస్తున్నారు. దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కరోనా సోకిన మొదటి వ్యక్తి ఎవరన్న విషయంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనానే వైరస్‌ను ప్రపంచానికి పాకేలా చేసిందని అమెరికా విమర్శిస్తోంది. అసలు చాలా మంది చనిపోయినా.. వైరస్ గురించి నిజాలు చైనా దాచి పెట్టి ఉంచిందని అందుకే ఇది పెండమిక్ స్టేజ్ వరకు వెళ్లిందని యూఎస్ అధికారులు ఫైర్ అవుతున్నారు. అమెరికా ఆర్మీనే ఈ వైరస్ ను చైనాకు తీసుకొచ్చిందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాహో ఆరోపణలు చేశారు. అమెరికాలో వైరస్ కట్టడికి చర్యలు తీసుకోకుండా తమపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని చైనా వాదిస్తోంది. కరోనా సోకిన తొలి వ్యక్తిని గుర్తించడంలో చైనా విఫలమైందని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్ట్ ఆరోపణలు చేయడంతో ఈ వైరస్ వార్ ముదిరింది.

 


మార్చి 15వ తేదీన నేష‌న‌ల్ ప్రేయ‌ర్ డేగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ట్రంప్ చెప్పారు.  విప‌త్క‌ర స‌మ‌యాల్లో దైవ ర‌క్ష‌ణ కోసం కూడా ఎదురుచూసిన చ‌రిత్ర అమెరికాకు ఉంద‌ని ట్రంప్ అన్నారు. ఎమ‌ర్జెన్సీ సేవ‌లు మ‌రింత త్వ‌ర‌గా అందేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  మ‌న దేశ ప్ర‌జ‌ల స్పూర్తి, ప‌ట్టుద‌ల బ‌ల‌మైన‌వ‌ని, ప్ర‌స్తుతం ఉన్న విప‌త్తును ఓడిస్తామ‌ని, అమెరికాకు గ‌డ్డు ప‌రిస్థితులు ఎదురైన స‌మ‌యంలో దేశం మ‌రింత పురోగ‌మించింద‌న్నారు. అమెరికా ప్ర‌జ‌ల ఆరోగ్యం విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం ముందు జాగ్ర‌త్త‌తో ఉంద‌ని అన్నారు. క‌రోనా వైర‌స్ రెస్సాన్స్ యాక్ట్‌ను ఉభ‌య‌స‌భ‌ల్లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. ఆ బిల్లుకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆయ‌న డెమోక్రాట్లు, రిప‌బ్లిక‌న్ల‌ను కోరారు. ఈ బిల్లు ద్వారా ఉచితంగా క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌నున్నారు. క‌రోనా సోకిన ఉద్యోగుల‌కు పెయిడ్ లీవ్ ఇవ్వ‌నున్నారు. క‌రోనాపై ట్రంప్ యుద్ధం ప్ర‌క‌టించ‌డంతో.. వాల్‌స్ట్రీట్‌లో మార్కెట్ షేర్లు దూసుకువెళ్లాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: