ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆది వారం వేళ స్థానిక ఎన్నికల పోరు నిలిపేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎవరూ ఊహించలేదు. అసలు ఆ సమయంలో ఆయన పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. అంతా ఎస్ ఈ సీ ప్రెస్ మీట్ అంటే అదే అనుకున్నారు. అందుకే ప్రిపేర్ అయ్యారు. కానీ నిమ్మగడ్డ అనూహ్యంగా ఈ బాంబు పేల్చారు.

 

 

కనీసం ఏపీలోని ఏ ఉన్నతాధికారికీ ఈ సమాచారం లేదు. అయితే ఈ స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయం టీవీ5, ఆంధ్రజ్యోతి మీడియాలు తమకు ముందే తెలిసిందని ప్రకటించుకున్నాయని మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఎన్నికలు వాయిదా వేస్తారని టీవీ5, ఆంధ్రజ్యోతి ముందే చెప్పామంటున్నాయి. ఎవరికీ అంచనా లేని అంశం ఆ మీడియాకు ఎలా తెలిసిందని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.

 

 

అంతే కాదు.. ఎన్టీఆర్‌కు పొడిచిన వెన్నుపోటును కప్పిపుచ్చుకునేందుకు ఓ పత్రికను నిర్వీర్యం చేసి.. ఆర్థికభారంతో మూతపడ్డ మరో పత్రికను తన డబ్బులతో వెలుగులోకి తెచ్చారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. రాజకీయాలు కోసం ఎంతకైనా బరితెగించే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి పేర్ని నాని విమర్శించారు.

 

 

నిమ్మగడ్డ నిర్ణయాన్ని సీఎం జగన్ తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇలా జగన్ విమర్శించకూడదంటున్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు.. కానీ.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల సంఘం ఉన్నతాధికారులపై.. ఏం మాట్లాడారో చంద్రబాబు గుర్తుచేసుకోవాలని మంత్రి పేర్ని నాని గుర్తు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిని కూడా అంతు చూస్తానని చంద్రబాబు బెదిరించారని చెప్పారు. ఇప్పుడు అదే చంద్రబాబు సూక్తులు చెబుతున్నారని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: