రాష్ట్రంలోని జనాలకే కాదు చివరకు పార్టీలోని నేతలకు కూడా ఇదే అనుమానం పెరిగిపోతోంది. గడచిన పది మాసాల్లో  జగన్మోహన్ రెడ్డికి చాలా ఎదురు దెబ్బలే జరిగాయి. మామూలుగా ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని దెబ్బలు తినడు. కానీ జగన్ కు మాత్రం దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. జగన్ కు ఇన్ని దెబ్బలు తగులుతుండటానికి ప్రధాన కారణం ఏమిటి ?  ఏమిటంటే సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు లేరని అర్ధమైపోతోంది.

 

అవును ప్రత్యర్ధుల వ్యూహాలను ముందుగా గ్రహించి దానికి తగ్గట్లుగా విరుగుడు ఆలోచించ లేకపోవటమే అసలు సమస్య.  ప్రధాన ప్రత్యర్ధి చంద్రబాబును ఎదుర్కోవాలంటే మామూలుగా ఆలోచిస్తే సరిపోదు. చంద్రబాబును ఎదుర్కోవాలంటే జగన్ కూడా చంద్రబాబు లాగే ఆలోచించాలి. కానీ అలాంటిదేమీ జరుగుతున్నట్లు కనిపించటం లేదు. పదిమాసాల్లో సలహాదారులుగా జగన్ చాలామందినే పెట్టుకున్నాడు.

 

జగన్ కు తగులుతున్న ఎదురుదెబ్బలు చూస్తుంటే సలహాదారుల్లో ఏ ఒక్క సలహాదారుడు కూడా సరైన సలహాలిస్తున్నట్లు లేదు. ఒకవైపు కోర్టుల్లో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు అంశం  నిజానికి చాలా చిన్న విషయం. కానీ అదే పెద్దదిగా మారిపోయి కోర్టు దగ్గర చివాట్లు తినాల్సొచ్చింది. విశాఖపట్నంలో చంద్రబాబునాయుడును విమానాశ్రయంలో అడ్డుకునే విషయం కూడా చిన్నదే. కానీ కోర్టులో డిజిపి చివాట్లు తినాల్సొచ్చింది.

 

పై రెండు అంశాల్లోను జగన్ కు నేరుగా ప్రమేయం లేకపోయినా బాధ్యత మాత్రం జగనే వహించాల్సొచ్చింది. శాసనమండలిలో రెండు బిల్లులను సెలక్ట్ కమిటికి పంపే విషయంలో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. బిల్లుల విషయంలో టిడిపి ఏ విధంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని పసిగట్టటంలో జగన్ తో పాటు సలహాదారులు కూడా ఫెయిల్ అయినట్లే లెక్క.

 

తాజాగా స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదా పడే అవకాశం ఉందని ప్రభుత్వానికి అణుమాత్రం కూడా అనుమానం రాకపోవటమే విచిత్రం. ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి బంధువన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి నిమ్మగడ్డను ముందు జాగ్రత్తగానే పోస్టు నుండి తప్పించేస్తే సరిపోయేదని ఇపుడు పార్టీలో తీరిగ్గా చర్చించుకుంటున్నారు. ముందుగా మేల్కొనని ఫలితంగానే విషయం ఇపుడు కంపు అయిపోయింది. మరి జగన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా సలహాదారులందరూ ఏమి చేస్తున్నట్లు ?  ఇంతమంది సలహాదారులు నెలకు లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్నా జగన్ కు ఎదురుదెబ్బలు తగులుతునే ఉన్నదంటే ఏమిటర్ధం ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: