తెలంగాణలో ఎన్నికలు జరిగే ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏకంగా అరడజను పైగా నేతలు క్యూ కట్టారు. ఈ సీటు కోసం కొందరు సీఎం కేసీఆర్ ను నమ్ముకుంటే.. మరి కొందరు యువ నేత కేటీఆర్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరికొందరు కెసిఆర్ కుమార్తె మాజీ ఎంపీ కవిత ను నమ్ముకుని ఆమె చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. కేవలం రెండున్నర ఏళ్ల కాలం మాత్రమే ఉన్న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. గతంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్సీ రేకుల భూపతిరెడ్డి.. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ మారిన‌ ఆయనపై అనర్హత వేటు పడడంతో ఇప్పుడు ఈ సీటు దక్కించుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు.



ఈ ఎమ్మెల్సీ సీటు పదవీ కాలం 2022 జనవరి వరకే ఉంది. కేవలం రెండేళ్లలోపు ఉన్నా వచ్చిన అవకాశం వదులుకోవద్దని ఆశావాహులు సైలెంట్ గా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా ఈ పదవి మాజీ స్పీకర్ సురేందర్ రెడ్డికి దక్కుతుందని అనుకున్నారు. అయితే ఆయనకు అనూహ్యంగా రాజ్యసభ పదవి దక్కింది. ఇక ఇప్పుడు సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు అయిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే రెండున్న‌రేళ్లు మాత్ర‌మే ఉండ‌డంతో మండ‌వ ఈ ప‌ద‌విపై అనాస‌క్తితో ఉన్నార‌ట‌.



మండవతో పాటు, మంత్రి కేటీఆర్‌కు సన్నిహితునిగా పేరున్న మాచారెడ్డికి, టీఆర్ఎస్ నేత నర్సింగ రావు, మాజీ ఎంపీ కవిత అనుచరునిగా ముద్రపడ్డ కామారెడ్డి జిల్లా మైనార్టీ నేత ముజుబుద్దిన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నేతలు పదవికి పోటీ పడుతున్నారట. అయితే కేసీఆర్ మాత్రం మండ‌వ‌కే ఈ ప‌ద‌వి ఇవ్వాల‌ని చూస్తున్నార‌ట‌. మండ‌వ అనుచ‌రులు మాత్రం.. మాజీ మంత్రి అయిన ఆయ‌న సీనియార్టీకి రాజ్య‌స‌భ అయితేనే క‌రెక్ట్ అంటున్నారు. ఒక‌వేళ కేసీఆర్ అనుకున్న‌ట్టుగా మండ‌వ‌కు ఈ ప‌ద‌వి ఇస్తే.. ఇప్ప‌టికే త‌గ్గిపోయిన తుమ్మ‌ల ప్రాబ‌ల్యం మ‌రింత త‌గ్గిపోయిన‌ట్లువుతుంద‌న్న గుస‌గుస‌లు కూడా వ‌స్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: