సీఎం కేసీఆర్ రైతులకు శుభవార్త చెప్పారు. ఈ నెలాఖరు నుండి రాష్ట్రంలో రుణమాఫీ అమలు చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఈరోజు రుణమాఫీకి సంబంధించిన నిబంధనలను వెల్లడించింది. అసెంబ్లీ వేదికగా కొన్ని రోజుల క్రితం రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ హామీని నిలబెట్టుకున్నారు. ప్రభుత్వం రుణమాఫీ అమలు దిశగా చర్యలు చేపట్టటంతో రాష్ట్ర రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
రుణమాఫీ నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాల ఉత్తర్వులను వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన రెడ్డి విడుదల చేశారు. నిబంధనల ప్రకారం లక్ష రూపాయల లోపు రుణాలు నాలుగు విడతల్లో మాఫీ కానున్నాయి. రుణమాఫీకి 2014 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 11 2018 మధ్య లోన్ తీసుకున్న రైతులు అర్హులు. వ్యవసాయ శాఖ గ్రామాల వారీగా, బ్యాంకుల వారీగా రైతు రుణాల జాబితాను తయారు చేయనుంది. 
 
 
మెట్రో పాలిటన్ సిటీ హైదరాబాద్ లో, పట్టణాలలో రుణాలు తీసుకున్నా ఆ రైతులకు రుణమాఫీ వర్తించదు. ప్రభుత్వం తొలి దశలో 25 వేల లోపు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ చేయనుంది. చెక్కుల ద్వారా ప్రభుత్వం రైతులకు రుణమాఫీ మొత్తాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది. 2014 ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న రుణాల్లో రీ షెడ్యూల్ చేసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. 
 
ఒక కుటుంబంలో ఎంతమంది రుణాలు తీసుకున్నా ఒక్కరి రుణం మాత్రమే ప్రభుత్వం మాఫీ చేయనుంది. ప్రభుత్వం ఈ మేరకు జీవో జారీ చేసింది. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. త్వరలో ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో చెక్కులను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో లక్షల్లో రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై రాష్టంలో అన్ని వర్గాల నుండి హర్షం వ్యక్తం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: