జగన్ ది పదేళ్ళ రాజకీయం. ఈ పాటికి ఆయన అనుభవం అంబరం తాకాలి. పైగా ఆయన రాజకీయాలకు కొత్త కాదు. ఆయన తండ్రి, తాతల నుంచి ఇంట్లో వంట్లో రాజకీయం ఉంది. అటువంటి జగన్ అధికారంలో ముఖ్యమంత్రిగా పది నెలల్లోనే ఎన్నో సాధించారు. కానీ ఏం లాభం.

 

ఆయన కష్టమంతా బూడిద‌లో పోసిన పన్నీరు అవుతోంది. జగన్ మొండితనం ఒంటెద్దు పోకడల విధానాలే ఇపుడు ఆయనకు చేటు తేస్తున్నాయి. జగన్ కి రాజకీయం అసలైన  అబ్బలేదు. ఆయన ఇప్పటికీ విపక్షంలోనే ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. ఏపీలో జరిగిన అనేక పరిణామాలు చూస్తే చంద్రబాబే ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నారా అనిపిస్తోంది.

 

నిజానికి జగన్ కి ఎంతటి అవమానం. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్నిక‌ల సంఘం ఎన్నికలు వాయిదా వేస్తే అది ఆయన కూడా టీవీలో చూసి తెలుసుకోవడం అంటే అంతకంటే అవమానం ఉంటుందా. ఎన్నికల సంఘం సర్వ స్వతంత్రమైనదే. కానీ అది ఏ పని చేయించాలన్నా అక్కడ ప్రభుత్వం ద్వారానే చేయించాలి.

 

అంటే కళ్ళూ, ముక్కూ చెవులూ ఎన్నికల సంఘానికి ప్రభుత్వమే. అటువంటి ప్రభుత్వం నుంచి వివరాలు రప్పించుకుని ఎన్నికలను వాయిదా వేయించడం చేసి ఉంటే అది ఇటు ఈసీకి, అటు ప్రభుత్వానికి కూడా బాగా ఉండేది. ఇపుడు సర్వాధికారాలు ఉన్నాయని ఈసీ నిర్ణయం తీసుకుని ఏకంగా ప్రభుత్వంతోనే పేచీ తెచ్చుకున్నారు.

 

రాజ్యాంగం ప్రకారం కరెక్ట్ అయినా వ్యవహారికంగా అది పొరపాటే అవుతుందని అంటున్నారు నిపుణులు. అంతవరకూ ప్రభుత్వంతో సఖ్యత నెరిపి ఒక్కసారిగా తన అధికారాలు గుర్తుకొచ్చినట్లుగా అసాధారణమైన నిర్ణయం ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్నారని విమర్శలు ఉన్నాయి. ఇపుడు ఒక అగాధం ప్రభుత్వానికి, ఈసీకి ఏర్పడింది.

 

సరే జరిగింది జరిగింది అని బయటకు కనిపించకుండా సర్దుకోవడం ఈ సర్కార్ కి చాతకాలేదు. దాంతో జగన్ నానాయాగీ చేసి దాన్ని మరింతగా చిరిగి చాట చేశారు. ఇపుడు జగన్ కు రాజ్యాంగ వ్యవస్థలకు మధ్య యుధ్ధం పెట్టి చంద్రబాబు వంటి వారు చోద్యం చూస్తున్నారు. ఈ సమయంలో జగన్ కి ఒక్క పార్టీ కూడా మద్దతు ఇవ్వడంలేదు.

 

నిజానికి జగన్ రాజకీయంగా కూడా వ్యూహాలు చేయాల్సిన అవసరం ఉంది. ఏపీలో ఉన్న టీడీపీ, జనసేన వంటి వాటితో విభేదాలు ఉంటే మిగిలిన పార్టీలను జగన్  చేరదీయవచ్చు కదా. పేదలకు జగన్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వామపక్షాల మద్దతు అయినా జగన్ తీసుకోవచ్చు. కానీ జగన్ అలాగే మీడియాని కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. దాంతో జగన్ ఒక్కడే మిగిలిన వారంతా మరో వైపు అన్నట్లుగా సీన్ ఉంది. 

 


 జగన్ మంచి చేసినా తప్పు అన్నట్లుగా జనంలోకి పోతోంది. ఓ విధంగా జగన్ వ్యూహాలు లేకుండా చేస్తున్న తప్పులతో బలహీనమైన స్థితిలో ఉన్న బాబు బలపడుతున్న ఫీలింగ్ కలుగుతోంది. 151 ఎమ్మెల్యేలతో ఉన్న జగన్ 20 మంది ఎమ్మెల్యేలు  ఉన్న బాబు  ముందు  వరసగా ఓడిపోవడం అంటే దారుణమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: