జ‌న‌గామ జిల్లా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది. గ‌త ఎన్నిక‌ల్లో తాటికొండ రాజ‌య్య టీఆర్ ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ హ‌యాంలో ప్రాతినిధ్యం వ‌హించిన మాజీ డిప్యూటీ సీఎం శ్రీహ‌రి ప‌ట్టుకోసం విప‌రీతంగా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రాజ‌య్యం కూడా గ‌తంలో డిప్యూటీ సీఎంగా ప‌నిచేసిన విష‌యం తెలిసిందే. ఆ ఇద్ద‌రు మాజీ డిప్యూటీ సీఎంలు నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టుకోసం విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  ఇద్ద‌రు నేత‌లు నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రికీ వారుగా వ‌ర్గ రాజ‌కీయాల‌ను ప్రొత్స‌హించుకుంటూ పార్టీని గంగ‌లో క‌లుపుతున్నార‌న్న విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.

 

ఇటీవ‌ల జ‌రిగిన ప్రాథ‌మిక ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి ప‌ట్టులేని కాంగ్రెస్ ఐదు ప్రాథ‌మిక స‌హ‌కార సంఘాల‌ను గెలుచుకుని టీఆర్ ఎస్ పార్టీనే బోల్తా కొట్టించింది. అయితే దీనికి ప్ర‌ధాన కార‌ణం ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య అభ్య‌ర్థుల‌కు క‌డియం వ‌ర్గీయుల నుంచి ఏమాత్రం మ‌ద్ద‌తు ల‌భించ‌క‌పోవ‌డంతోనే టీఆర్ ఎస్ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థులు ఓట‌మి పాలు కావాల్సి వ‌చ్చింద‌న్న చ‌ర్చ టీఆర్ ఎస్ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. క‌డియం కావాల‌నే నా నియోజ‌క‌వ‌ర్గంలో వేళ్లు..కాళ్లు దూరుస్తున్నాడంటూ ఎమ్మెల్యే రాజయ్య మంత్రి కేటీఆర్‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాడ‌ని స‌మాచారం.

 

 క‌డియం సీనియ‌ర్ కావ‌డంతో కేటీఆర్ ప్ర‌త్య‌క్షంగా జోక్య చేసుకోకుండా కొంత‌మంది ముఖ్య‌నేత‌లను తెలంగాణ భ‌వన్‌కు పిలిపించుకుని ఎమ్మెల్యేనే మీకు సుప్రీం అంటూ సూటిగా చెప్పార‌ట‌. ఈ విష‌యం తెలిసిన క‌డియం వ‌ర్గీయులు త‌మ‌కు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని, నామినేటెడ్ పోస్టులు అన్ని కూడా రాజయ్య వ‌ర్గీయుల‌కే కేటాయిస్తున్నారంటూ నేరుగా ముఖ్య‌మంత్రిని క‌ల‌వాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. మొత్తంగా తాడోపేడో తేల్చుకోవాల‌ని ఆగ్ర‌హ‌వేశాల‌తో ఊగిపోతున్న‌ట్లు స‌మాచారం. అయితే  క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ బిజీబిజీగా ఉన్నార‌ని క‌డియం వారిని శాంతింప‌జేసిన‌ట్లుగా స‌మాచారం.కేసీఆర్‌తో క‌డియం భేటీ అయ్యే వార్త‌లు ఓరుగ‌ల్లు రాజ‌కీయాల్లో వేడిని పుట్టిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: