స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన విజయవాడ రాజకీయాల్లో మాత్రం వేడి తగ్గలేదు. విజయవాడ కార్పొరేషన్‌లో గెలుపుని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేస్తున్నాయి. తమ శక్తి మేర రాష్ట్రంలోనే కీలకంగా ఉన్న విజయవాడ కార్పొరేషన్‌ని సొంతం చేసుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అయితే ఈ ఎత్తులు వేయడంలో అధికార వైసీపీ కాస్త పక్కదారి పట్టినట్లు కనిపిస్తోంది. తమకున్న అధికారాన్ని వినియోగించుకుని కార్పొరేషన్‌ని ఎలా అయిన సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

 

అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి వారి నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించుకోలేకపోతే మంత్రి పదవులు పోతాయని జగన్ హెచ్చరించిన నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో టీడీపీకి అనుకూల వాతావరణం ఉండటంతో వైసీపీ గెలుపుపై అనుమానాలు మొదలయ్యాయి. పైగా ఎంపీ కేశినేని నాని కుమార్తె మేయర్ అభ్యర్ధి కావడంతో, వెల్లంపల్లి వైసీపీని గెలిపించుకోవడానికి తెగ కష్టపడుతున్నారు.

 

వైసీపీ అభ్యర్ధులని గెలిపించుకోవడానికి వెల్లంపల్లి అనుచరులు, టీడీపీ అభ్యర్ధులని బెదిరించి నామినేషన్ విత్‌డ్రా చేయించే కార్యక్రమాలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. మొన్న నామినేషన్ సమయంలోనే 39 డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ధి శివరామశర్మపై దాడులకు కూడా దిగారని ఎంపీ కేశినేని ఆరోపించారు. అలాగే పలుచోట్ల టీడీపీ అభ్యర్ధులని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇక అదే 39వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన శివరామశర్మపై తాజాగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎన్నికల్లో టీడీపీ నుండి కాకుండా వైసీపీ నుండి పోటీ చెయ్యాలని వెల్లంపల్లి శ్రీనివాసరావు బెదిరించారని ఆయన టీడీపీ నుండి పోటీ చెయ్యటంతో అతనిపై పోలీసులతో బలవంతంగా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని, టీడీపీ బ్రాహ్మణ నేతలు విమర్శిస్తున్నారు. మొత్తానికైతే విజయవాడలో తమకు గెలిచే ఊపు ఉందని చెప్పి,  వెల్లంపల్లి వర్గం అడ్డగోలు రాజకీయాలు చేయడానికి సిద్ధమైపోయారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: