రైతుల కోసం జగన్ సర్కారు ఓ కొత్త యాప్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ యాప్ పేరు ఈ- పంట. పంటలతోపాటుగా వెరైటీలను కూడా ఈ అప్లికేషన్‌లో పొందుపరుస్తారు. రైతు సాగు చేస్తున్న పంట మొదటి పంటా, రెండో పంటా, మూడో పంటా, లేక చేపలు పెంచుతున్నారా? ఉద్యాన వన పంటలు వేస్తున్నారా? ఈ పంటల్లో అంతర పంటగా మరో పంటను ఏదైనా వేశారా? సమగ్ర వివరాలు అప్లికేషన్‌లో పొందుపరచారు.

 

 

రబీ సీజన్లో ఈ అప్లికేషన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. -పంట విధానం వ్యవసాయరంగంలో కీలక మలుపు అవుతుందని భావిస్తున్నారు. -పంట వల్ల పంటల బీమా రిజిస్ట్రేషన్, వ్యవసాయ ఉత్పత్తులకు తగిన ధరలు లభించేందుకు ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకునే వీలు కలుగుతుంది. - పంట విధానాన్ని బ్యాంకులకు అనుసంధానం చేయడం ద్వారా సకాలంలో రుణాలు లభ్యం కావడానికి, వేసిన పంటలకు తగినట్టుగా రుణం పొందడానికి ఉపయోగపడుతుంది.

 

 

ప్రతి రైతు ఈ-పంట కింద రిజిస్టర్‌ అయ్యేలా చూస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ పంట కింద వివరాల నమోదు డేటా బ్యాంకులతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల సాగు చేసిన పంటలకు తగిన రీతిలో రుణాలు పొందే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా పంట బీమాకూడా సమగ్రంగా, వేగంగా పొందే అవకాశం ఉంటుంది.

 

 

రైతులు ఏ పంటలు వేశారన్నది ముందుగానే తెలుస్తుంది కాబట్టి సంబంధిత ఉత్పత్తులకు మార్కెట్లో ఎలాంటి రేట్లు లభిస్తున్నాయో పర్యవేక్షణ చేయడంతోపాటు, రైతు నష్టపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వమే జోక్యం చేసుకుని మార్కెట్‌లో పోటీ పెంచడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రయత్నాలు చేస్తారు. ఐడియా బాగానే ఉంది. మరి దీని అమలు ఎంత బావుంటుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: