కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబుకు ఇక కారులో చోటు లేన‌ట్లేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. స్థానిక ఎన్నిక‌లు ముగిసిన నాటి నుంచి ఆయ‌న గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్న అధిష్ఠానం వాయిదా వేస్తూ వ‌స్తోంద‌ట‌. దీనికి ప్ర‌ధాన కార‌ణం పెద్దప‌ల్లి జ‌డ్పీచైర్మ‌న్, గ‌తంలో మంథ‌ని నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హించిన పుట్ట‌మ‌ధుయే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అయితే పార్టీలో చేరిక‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ను ఒప్పించ‌గ‌లిగిన శ్రీధ‌ర్‌బాబు కేటీఆర్ మ‌న‌సు మాత్రం దోచుకోలేక‌పోయాడని స‌మాచారం. పుట్ట‌మ‌ధుతో పాటు రామ‌గుండం నేత‌లు కూడా కొంత‌మంది వ్య‌తిరేకించ‌డం వ‌ల్లే ఆయ‌న చేరిక‌కు బ్రేకులు ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది.

 

మంత్రి ద్వారా కేసీఆర్‌కు ఇటీవ‌ల సైతం రాయ‌బారం పంపిన శ్రీధ‌ర్‌బాబుకు చేదు అనుభ‌వ‌మే ఎదురైందంట‌. టీఆర్ ఎస్‌లోకి వెళ్ల‌డం ఇక అసాధ్య‌మ‌ని డిసైడ్ అయినా శ్రీధ‌ర్‌బాబు తాను పీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్నానంటూ ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో త‌న అనుచ‌రుల చేత లీకుల‌తో కూడా ప్ర‌చారం చేయించుకున్నాడని పార్టీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో కాంగ్రెస్ క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితి స్థాయికి చేరుకోవ‌డం, మంథ‌ని నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద‌గా చెప్పుకోద‌గిన అభివృద్ధి ప‌నులు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో రాజ‌కీయంగా మ‌నుగ‌డ ఉండాలంటే పార్టీ మార్పు త‌ప్ప‌ద‌ని ఆయ‌న త‌న స‌న్నిహితుల‌తో వ్యాఖ్య‌నించారట‌.

 

అనుకున్న‌ది ఒక్క‌టీ...అయిన‌ది ఒక్క‌టీ బోల్తా కొట్టిందేలే శ్రీధ‌ర్‌బాబు అంటూ ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు పాట పాడుకుంటున్నార‌ట‌. కాంగ్రెస్‌లో ఉండి గ‌ట్టిగా పోరాడినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌బోద‌న్న‌ది ఎమ్మెల్యే ఆలోచ‌న‌గా తెలుస్తోంది. కాంగ్రెస్‌తో త‌న కుటుంబానికి ద‌శాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని తెచ్చుకోవ‌డానికి సిద్ధ‌ప‌డిన గులాబీ అధినేత కేసీఆర్ నుంచి ఇలా క‌నీసం గౌర‌వం ద‌క్క‌క‌పోవ‌డంతో ఆయ‌న ఇగో బాగా హ‌ర్ట్ అయిన‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. చేసేదేమీ లేక కాంగ్రెస్ కండువానే క‌ప్పుకుంటూ ప్ర‌భుత్వం విధానాల‌పై దునుమాడుతూ...ప్ర‌జానాయ‌కుడిగా పేరు పొందుతూ..క్యాడ‌ర్ జారీ పోకుండా కాపాడుకునే ప‌నిలో శ్రీధ‌ర్‌బాబు ఉన్నాడంటూ రాజ‌కీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: