ప్రపంచాన్ని దిగ్బంధిస్తోంది కరోనా. చాలా దేశాలు షట్ డౌన్ దిశగా సాగుతున్నాయి. కోట్లాది మందిని ఇది హడలెత్తిస్తోంది. ఒక వైరస్.. ఇంతలా  భయపెట్టడానికి కారణాలేంటి ? అసలు ఈ వైరస్ లు అంటే ఏంటివి ? అవి ఎలా వ్యాపిస్తాయి ?

 

కరోనా ఇప్పుడు ప్రపంచానికి పెనుముప్పుగా మారిం0ది. 166 దేశాలపై ఇది ప్రభావం చూపిస్తోంది. ఇటలీ సహా అనేక దేశాలు దిగ్భంధనమయ్యాయి. రెండు లక్షల మంది దీని బారిన పడ్డారు. దాదాపు ఎనిమిది వేల మంది ప్రాణాలు కోల్పోయారు. డిసెంబరు మొదటి వారంలో చైనాలోని వుహాన్ లో ప్రారంభమైన కరోనా  విలయతాండవం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ తన విస్తృతి పెంచుకుంటూ పోతోంది. అసలు ఈ మహమ్మారి సంగతి గురించి తెలియాలంటే.. వైరస్ ల గురించి  తెలుసుకోవాలి.

 

వైరస్ ఎప్పుడూ డేంజరే. ఏ రూపంలో అయినా ఎటాక్ చేయొచ్చు. జంతువుల ద్వారా దాడి చేయొచ్చు. గాల్లో కలిసిపోయి రావచ్చు. కంట్రోల్ చేద్దామంటే వ్యాక్సిన్​లుండవు. ఈ మహమ్మారి గురించి అవగాహన పెంచుకునేలోగానే వందలు, వేలాదిమంది ప్రాణాలు కోల్పోతారు. దాని ఉనికిని కనిపెట్టడం.. అది ఎలా పరివర్తన చెందుతుందో తెలుసుకోవడానికి సమయం పడుతుంది. పైగా అప్పటివరకు మానవ శరీరానికి ఇలాంటి దాడికి సంబంధించి అనుభవం ఉండకపోవడంతో.. రోగ నిరోధక శక్తి వల్ల ఆ వైరస్ లను పూర్తిగా ఎదుర్కోవడం సాధ్యం కాదు. ఈ వైరస్ ల గుట్టు కనుక్కొని దానికి వ్యాక్సిన్ తయారయ్యేలోపు అవి చేయాల్సినంత నష్టం చేస్తుంటాయి. ఇప్పుడు కరోనా కూడా ఈ కోవకు చెందినదే.

 

వైరస్ అనే పదం లాటిన్ నుంచి వచ్చింది. లాటిన్ లో వైరస్ అంటే విషమని అర్ధం. వైరస్ లు అతి సూక్ష్మమైనవి. జన్యుపదార్థాలైన dna లేదా RNAతో ఇవి తయారై.. చుట్టూ ఒక రక్షణ కవచంతో కాపాడపబడుతూ ఉంటుంది. ఈ ప్రొటెక్షన్ వాల్.. ప్రొటీన్లతో చేయబడి ఉంటుంది. దీనిని క్యాప్సిడ్ అంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఇవి కేవలం జన్యుసమాచారం కలిగి ఉన్న పదార్థాలు. ఇవి ఇతర జీవుల కణాలపై దాడిచేసి వృద్ధి చెందుతాయి. ఇతర జీవకణాల్లోకి ఇవి చొచ్చుకెళ్లి.. ఆ కణాన్ని ఒక రకంగా హైజాక్ చేస్తాయి. ఇక అక్కడి నుంచి అవి ఉత్పత్తి అవుతాయి. ఈ వైరస్ ల దాడి ముఖ్య ఉద్దేశం వైరస్‌ల సంతతిని పెంచుకోవడమే. వైరస్‌లు వాటంతట అవి విభజన చెందలేవు. విభజన చెందాలంటే వేరే జీవకణం తప్పనిసరి.

 

వైరస్ అనేది ఉందని.. 1892లో కనిపెట్టారు. అయితే అప్పటి కొన్ని శతాబ్దాల ముందు నుంచే వైరస్ లు మానవజాతిపై దాడి చేస్తూనే ఉన్నాయి. లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్నాయి. వైరస్‌ల వల్ల వచ్చే వివిధ రకాల వ్యాధులు మానవజాతిని తరతరాలుగా పీడిస్తూ వచ్చాయి. వీటిలో ముఖ్యమైనవి ఎయిడ్స్, ఆటలమ్మ, మశూచి, తట్టు, పోలియో, యెల్లో ఫీవర్, రేబీస్ వంటివి. వైరస్‌లు బాక్టీరియాపై దాడి చేయగలవని 20వ శతాబ్ద ప్రారంభంలో ఫ్రెడెరిక్ త్వార్ట్ కనుగొన్నాడు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఆవిష్కరించబడిన తర్వాత మొట్టమొదటి సారిగా వైరస్‌లను చూడగలిగారు. మాలిక్యులర్ బయోటెక్నిక్స్ వల్లే వీటి ఆవిర్భావాన్ని అధ్యయనం చేయటానికి వీలవుతుంది.

 

వైరస్ లు.. అసలు వ్యాధులను ఎలా కలగజేస్తాయంటే.. కణాలపై వీటి ప్రభావంవల్ల కణ విచ్ఛేదనం జరిగి కణాలు నశిస్తాయి. బహుకణ జీవులపై వైరస్లు దాడి చేసినప్పుడు.. ఇలా కొన్ని అవసరమయిన కణాలు మరణిస్తే దాని ప్రభావం మొత్తం జీవిపై ఉంటుంది. చాలా వైరస్లు అరోగ్యకరమైన సమన్వయాన్ని చెడగొట్టి వ్యాధులను కలుగజేస్తాయి, కొన్ని మాత్రం ఎటువంటి హాని కలుగజేయకండా కూడా జీవించగలుగుతాయి. అయితే వైరస్ లు.. ప్రత్యుత్పత్తి కోసం.. ఇతరుల జన్యు పరికరాలపై ఆధారపడంవల్ల ఆ వ్యక్తికి ఎటువంటి హాని కలగకుండా వీటిని నివారించడం కష్టమైన పని. టీకాల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించడం వల్లనే.. ఈ వైరస్ ల వ్యాప్తిని అడ్డుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: