నిర్భయ దోషులకు ఈసారైనా ఉరిశిక్ష అమలవుతుందా? మరోసారి వాయిదా పడుతుందా?.. పరిణామాలు చూస్తుంటే ప్రతిఒక్కరిలోనూ ఇలాంటి సందేహాలే మెదులుతున్నాయి. శిక్ష నుంచి తప్పించుకునేందుకకు దోషులు చేస్తున్న ప్రయత్నాలూ అలాగే ఉన్నాయి.

 

నిర్భయదోషులకు ఉరిశిక్ష పడి మూడు నెలలైంది. ఈ మూణ్నెళ్ల కాలంలో ముచ్చటగా మూడుసార్లు వాయిదా పడింది. మార్చి 20న ఉదయం ఐదున్నరకు ఉరి తీయాలంటూ ఇటీవలే నాలుగోసారి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది ట్రయల్‌ కోర్టు. అయితే, శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే.. ఈసారి కూడా ఉరిశిక్ష వాయిదా పడుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్‌ సింగ్‌ తాజాగా ఢిల్లీ కోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశాడు. 2012 డిసెంబరు 16న నిర్భయ అత్యాచార ఘటన జరిగినప్పుడు.. తానసలు ఢిల్లీలోనే లేనని పిటిషన్‌లో పేర్కొన్నాడు. డిసెంబర్‌ 17, 2012న రాజస్థాన్‌ నుంచి పోలీసులు తనని ఢిల్లీ తీసుకొచ్చారని చెప్పుకొన్నాడు. తిహార్ జైలులో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించాడు. తనకు మరణశిక్ష రద్దు చేయాలని కోరాడు. ఢిల్లీలోని పటియాలా హౌజ్‌ కోర్టు అడిషనల్‌ సెషన్స్‌ న్యాయమూర్తి ధర్మేంద్ర రాణా ముందు తన పిటిషన్‌ని ఉంచాడు. 

 

కాగా, ఇప్పటికే నిర్భయ దోషుల తరపు న్యాయవాది.. ఈ మరణశిక్షను నిలిపివేయాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ఉరిశిక్ష విధింపు చట్టవిరుద్ధమని, నిలిపివేయాలని ఐసీజేను కోరారు. అయితే ఇది ఐసీజే పరిధిలోకి రాధని న్యాయనిపుణులు అంటున్నారు. దీంతో ఇందులో ఐసీజే కలుగజేసుకోదనే వాదన వినిపిస్తోంది. దీనికి తోడు, తాజాగా ముఖేష్‌ సింగ్‌... పాటియాలో కోర్టులో మరో పిటిషన్‌ వేయడంతో ఈసారైనా ఉరిశిక్ష అమలవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇపుడు యావత్ దేశం నిర్భయ దోషుల ఉరిశిక్షపై ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఖచ్చితంగా ఉరిశిక్ష పడితే ఆమె ఆత్మ శాంతి చేకూరుతుందని అభిప్రాయపడుతోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: