గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ అనుమానితులు టెర్రర్  సృష్టిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల లెక్కల ప్రకారం  386 మంది కరోనా వైరస్ అనుమానితులున్నారు.   అయితే అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య 700 దాకా ఉండచ్చంటున్నారు. వీళ్ళల్లో అత్యధికులు ఇటలీ, సౌదీ అరేబియా లాంటి దేశాల నుండి వచ్చిన వాళ్ళే కావటం గమనార్హం. అయితే వీళ్ళకందరికీ కరోనా వైరస్ ఉందని చెప్పటం లేదు. కాకపోతే ఇతర దేశాల నుండి రావటంతో వీళ్ళకు కరోనా వైరస్ సోకి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

ఇదే సందర్భంలో విదేశాల నుండి వచ్చిన వాళ్ళ విషయంలో ఇరుగు పొరుగు జనాలే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. సార్ విదేశాల నుండి వచ్చారు కానీ ఇంట్లోనే ఉండకుండా బయట తిరుగుతున్నారంటూ పక్క ఇళ్ళ వాళ్ళే ఫిర్యాదులు చేస్తుండటంతో వైద్యాధికారులకు ఏమి చేయాలో అర్ధం కావటం లేదు. వచ్చిన ఫిర్యాదుల ప్రకారం అనుమానితులతో నేరుగానో లేకపోతే ఫోన్ల ద్వారానో అధికారులు మాట్లాడుతున్నారు.

 

కరోనా వైరస్ పరీక్షలు చేసుకోవాలని, 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకోవాలని ఎంత చెప్పినా ఎవరూ వినటం లేదట. విదేశాల నుండి వచ్చిందో తోబుట్టువుల ఇళ్ళల్లో ఫంక్షన్ల కోసమైతే అంతా వదిలిపెట్టి తమ ఇంట్లోనే ఎలా ఉంటామంటూ ఎదురు తిరుగుతున్నారు. ఇంకొందరైతే ఎవరినీ కలవకుండా ఇంట్లోనే  ఎలాగుంటామంటూ అధికారులపై  మండిపడుతున్నారు. అతికష్టం మీద రెండు మూడు రోజులు ఇంట్లో ఉన్నా తర్వాత ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్ళిపోతున్నారు.

 

వైద్యాధికారులతకు కరోనా అనుమానితుల విషయంలో ప్రతిరోజు సుమారు 100 ఫిర్యాదులన్నా వస్తున్నాయి. ఫిర్యాదులు చేస్తున్న వాళ్ళకు సమాధానాలు చెప్పలేక అనుమానితులను నిర్బంధంగా ఇంట్లోనే ఉండేట్లుగా కట్టడి చేయలేక మధ్యలో అధికారులు నానా అవస్తలు పడుతున్నారు. మహారాష్ట్రతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అనుమానితుల మణికట్టు మీద అధికారులు ముద్రలు వేస్తున్నారు. ఈ ముద్రతో పలానా వ్యక్తి కరోనా అనుమానితుడనే విషయం అందరికి తెలుస్తోంది. దాంతో అందరు దూరంగా ఉంటున్నారు. కానీ ఏపిలో అలాంటిది అమలు కాకపోవటంతో అనుమానితులు అందరితో కలిసిపోయి  టెర్రర్ సృష్టిస్తున్నారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: