భక్తుడికి భగవంతుడికి అనుసంధానంగా నిలిచే ఆలయాలకూ కరోనా వైరస్ సెగ తప్పడం లేదు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా పలు ఆలయాలను తాత్కాలికంగా మూసేస్తున్నారు. భక్తులు సైతం తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.

 

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా  వైరస్ ఇప్పుడు దేవాలయాలపైనా పడింది. ఇప్పటికే  ప్రపంచ వ్యాప్తంగా వివిధ మతాలకు చెందిన అనేక పుణ్యక్షేత్రాలు మూతపడ్డాయి. వందలు వేల సంఖ్యలో భక్తులు ఒక దగ్గర చేరితే, వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. దీంతో దేవాలయాల్లో జరిగే పూజలకు, వివిధ కార్యక్రమాలకు భక్తులను అనుమతించటం లేదు.  తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలపై కరోనా ప్రభావం పడింది. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలు బోసిపోతున్నాయి. అటు భద్రాద్రిలో రామయ్య కల్యాణం కూడా భక్తులు లేకుండానే జరపనున్నారు. ఇటు తిరుపతిలో క్యూలైన్లను రద్దు చేశారు. నేరుగా దర్శనం కల్పిస్తున్నారు. ఆర్జిత సేవలు, సహస్రాభిషేకాలు రద్దు చేశారు. అన్నవరం, శ్రీకాళహస్తి ఆలయాలకు భక్తులు రావద్దని ఆలయ కమిటీలు సూచిస్తున్నాయి. 

 

ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోని  అనేక ప్రముఖ దేవాలయాల్లో సందర్శకుల సంఖ్య బాగా తగ్గింది. కరోనా వైరస్ అత్యవసర పరిస్థితి ముగిసే వరకూ ఈ ప్రదేశాలను సందర్శించకుండా ఉండాలని అనేక దేవాలయాల ట్రస్టులు భక్తులను కోరుతున్నాయి. దక్షిణ కన్నడలోని ధర్మస్థల మంజునాథ ఆలయం,  కుక్కే సుబ్రమణ్య ఆలయం, కొల్లూర్ మూకాంబిక, ఉడుపి, శృంగేరి శారదా పీఠం, కేరళలోని మధుర్ సిద్ది వినాయక , గోకర్ణ మహాబలేశ్వర్, మర్దోల్ మంగేష్ ఆలయాలు భక్తులు రావద్దని సూచిస్తున్నాయి. 

 

అటు మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగడంతో  షిర్డీ సాయి ఆలయాన్ని మూసివేశారు. దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ఆలయం ప్రకటించింది. షిర్డీసాయి ఆలయానికి దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. సాయిని దర్శించుకుని తరిస్తారు. దీంతో బాబా భక్తులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని ఆలయ కమిటీ సూచిస్తోంది. 

 

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం, ఉస్మానాబాద్‌ లోని తుల్జా భవానీ ఆలయాలను మూసివేయనున్నట్లు దేవాలయ అధికారులు తెలిపారు. సిద్ధి వినాయక ఆలయం తదుపరి ఉత్తర్వుల వరకూ మూతపడగా.. తుల్జాభవానీ ఆలయం మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకూ మూసి ఉంచుతారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలోని పురాతన మహంకాళీ దేవాలయాన్ని మూసివేశారు. 

 

వారణాసిలోని ప్రహ్లాదేశ్వర్ ఆలయంలో శివలింగానికి మాస్క్‌ వేసిన పోస్టర్లు ఉంచారు. భక్తుల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ పోస్టర్లు ఉంచామని, భక్తులెవరూ విగ్రహాలను ముట్టుకోరాదని ఆలయ ప్రధాన అర్చకుడు తెలిపారు. మాస్క్ ధరించే పూజారులు స్వామివారికి పూజాదికాలు నిర్వహిస్తున్నారు. గుజరాత్‌లోని ప్రఖ్యాత సోమనాథ ఆలయాన్ని భక్తుల సందర్శనార్ధం తెరిచినప్పటికీ అన్ని కార్యక్రమాలను ఈనెల 31 వరకూ రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.

 

జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయం విషయానికొస్తే ఇక్కడికి విదేశాల నుంచి వచ్చే భారతీయులు, విదేశీయుల రాకను నిషేధించారు. రాజస్థాన్‌లోని ప్రముఖ మెహదీపూర్ బాలాజీ మందిరాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కోల్‌కతాలోని రామకృష్ణ మఠంలో నిత్యం జరిగే ప్రసంగ కార్యక్రమాలను రద్దు చేశారు. ఒడిశాలోని జగన్నాథ మందిరంలో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు పలు నిబంధనలు విధించారు. మాస్క్ ధరించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని, ఒకరికొకరు దూరంగా నిలుచోవాలని సూచించారు. 

 

మరోపక్క ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం మక్కా ఖాళీ అయింది. మక్కా మసీదులోని కాబా చుట్టూ ప్రదక్షిణలు చేసే లక్షలాది మంది భక్తులతో 24 గంటల పాటూ కిక్కిరిసిపోయి కనిపించే మక్కా మసీదు ప్రస్తుతం ఖాళీగా మారింది. ఆయా దేశాల నుంచి వచ్చే భక్తుల వల్ల ఈ వైరస్ మరొకరికి సోకే ప్రమాదం ఉన్నందు సందర్శనను నిలిపివేసింది సౌదీ అరేబియా ప్రభుత్వం.  అటు జెరూసలేం లోనూ భక్తుల రాకపోకలపై నియంత్రణలు విధించారు. కీలక దర్శనీయ ప్రాంతాలను మూసివేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: