దేశంలో కరోనా ప్రభావం ప్రజా రవాణాపై పడింది. దేశవ్యాప్తంగా 85 రైళ్లు రద్దయ్యాయి. కరోనా నియంత్రణలో భాగంగా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న సర్వీసుల్ని రద్దు చేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. దక్షిణ మధ్యరైల్వేలోనే అత్యధిక రైళ్లు రద్దయ్యాయి. అటు ప్లాట్ ఫామ్ టికెట్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. 

 

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 583 రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను పెంచింది. 499 స్టేషన్లలో 20 రూపాయలకు పెంచగా.. మిగిలిన 84 స్టేషన్లలో 50 రూపాయలకు పెంచింది. నెలాఖరు వరకు పెంచిన రేట్లు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. సికింద్రాబాద్‌ సహా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే స్టేషన్లలో ఈ ధరను అమలు చేయనున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్లాట్‌ఫాంపై రద్దీని తగ్గించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

 

దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు గుంపులుగా ఉండొద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నాయి. ప్రజలు ఎక్కువగా చేరే మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, సినిమా హాళ్ల వంటి వాటికి మూసేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించింది. కరోనా వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ 39 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ముంబై, పూణె, భుసావల్, సోలాపూర్ డివిజన్లకు సంబంధించిన రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను 10 నుంచి 50 రూపాయలకి పెంచుతున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. పశ్చిమ రైల్వేలో కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. మొత్తం 250 రైల్వే స్టేషన్లలో ఈ నిర్ణయం అమలు చేస్తున్నారు. ఏసీ బోగీల్లో కర్టెన్లు తొలగిస్తున్నారు. ప్రయాణీకులకు దుప్పట్లు కూడా తాము అందించబోమని భారతీయ రైల్వే ప్రకటించింది. ఎవరి దుప్పట్లు వారే తెచ్చుకోవాలని కోరింది. 

 

దక్షిణ మధ్య రైల్వేలో 29 రైల్వే సర్వీసులు రద్దయ్యాయి. కరోనా వ్యాప్తికి అడ్డుకట్టు వేసే చర్యల్లో భాగంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు మార్గాల్లో 12 రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఏపీ, కేరళ, తమిళనాడు, ఒరిస్సాతో పలు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే మరో 17 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నిపివేస్తున్నట్లు తెలిపింది. రద్దైన వాటిలో హైదరాబాద్‌-కలబుర్గి, కరీంనగర్‌-ముంబై, చెన్నై-శాంత్రాగచ్చి, చెన్నై-సికింద్రాబాబ్‌, ముంబై- నాగ్‌పూర్‌, ముంబై-అజ్ని ట్రైన్‌ సర్వీసులు ఉన్నాయి. విశాఖ నుంచి ఢిల్లీ, సికింద్రాబాద్, తిరుపతి మార్గాల్లో ప్రయాణిస్తున్నకొన్ని రైళ్ళను మార్చి 31వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్టు వాల్తేర్ డివిజన్ ప్రకటన విడుదల చేసింది. విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖ ఏసీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ , సంబల్పూర్-బనస్వాడి స్పెషల్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్, సాంట్రాగచ్చి-ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రద్దయ్యాయి. ఆక్యుపెన్సీ పడిపోవడంతో పలు రైళ్ళు ఖాళీగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. గత ఏడాది ఇదే నెల తో పోలిస్తే ఐదుశాతం ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: