సుప్రీం కోర్టు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సమర్థించిన విషయం తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం అని కోర్టు పేర్కొంది. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్ ను ఎత్తివేయాలని ఎలక్షన్ కమిషన్ కు సూచించింది. ఈసీ అనుమతితో కొత్త పథకాల అమలు చేపట్టవచ్చని సుప్రీం పేర్కొంది. 
 
సుప్రీం తీర్పుతో ఏపీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గం సుగమమైంది. ప్రభుత్వం గతంలోనే మార్చి 25వ తేదీన ఉగాది పండుగ సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించింది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటం, ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ పథకానికి బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని కోర్టు ఆదేశించడంతో యధావిధిగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. 
 
ఇప్పటికే అధికారులు ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక, స్థలాల ఎంపికను పూర్తి చేశారు. ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని కోర్టు ఆదేశించటంతో ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో మొదట చేసిన ప్రకటన ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. ఏపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా ఈ పథకాన్ని ప్రకటించింది. లబ్ధిదారులకు ఉచితంగా ఇచ్చిన ఇంటి స్థలాలను ఐదేళ్ల తరువాత అమ్ముకునే సౌలభ్యం కల్పించింది. 
 
లబ్ధిదారులు ప్రభుత్వం అందజేసే ఇళ్ల పట్టాల ద్వారా బ్యాంకుల నుంచి పావలా వడ్డీకే రుణాలను పొందవచ్చు. ఈ పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుడు 2 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు ప్రయోజనం పొందనున్నారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాలను ఇంట్లోని ఆడవాళ్ల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించనుంది. ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం బడ్జెట్ లో 8615 కోట్ల రూపాయలు కేటాయించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: