ఢిల్లీలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో వైసీపీ, సీఎం, మంత్రులు, స్పీకర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కుల ప్రస్తావనతో చేసిన వ్యాఖ్యలు నిజంగా నిందించదగినవని అన్నారు. వైసీపీ, టీడీపీ ఏపీలో కుల రాజకీయాలకే ప్రాధాన్యమిస్తూ చివరకు ప్రజల సమక్షంలో కుల ప్రస్తావన చేస్తూ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు. 
 
ఇటువంటి సంస్కృతిని అధికారంలో ఉన్న వైసీపీ వీడాలని... ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తామేదో అద్భుతంగా గతంలో వ్యవహరించామని అనుకుంటే అది కూడా పొరపాటే అని అన్నారు. రెండు ప్రాంతీయ పార్టీలు రాజ్యాంగానికి అనుగుణంగా సామాజిక దృక్పథంతో పని చేయాలని కేవలం కుల రాజకీయాలు చేస్తూ, కుల దూషణలకు దిగుతూ ఈ రకంగా రాజకీయాలను భ్రష్టు పట్టించటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. 
 
రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా గత 15 రోజుల్లో నెలకొన్న పరిస్థితులు మరలా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ దేనని చెప్పారు. అధికారులు, పోలీస్ యంత్రాంగం వ్యవహరించిన తీరును ప్రజలు కూడా తప్పుబట్టారని వ్యాఖ్యానించారు. ఇటువంటి పోకడలకు పోకుండా సరైన వాతావరణంలో రాష్ట్రంలో ఎన్నికలు జరగాలని తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. 
 
అవినీతి, అక్రమాలు చేస్తూ రాజకీయాల్లో లబ్ధి పొందాలనుకోవడం సరికాదని అన్నారు. అధికార పార్టీ వైసీపీకి, ఇటువంటి పోకడలే గతంలో చేసిన టీడీపీకి ప్రజా సంక్షేమం దృష్ట్యా తాము సందేశం ఇస్తున్నామని చెప్పారు. తమ మాట వినకపోతే రెండు ప్రాంతీయ పార్టీలు ప్రజాగ్రహానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. అందుకే బీజేపీ జనసేన కుల కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని వివరించారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమీ మంచి ఫలితాలను సాధిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. 2024 ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయని ప్రకటన చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: