ఆంధ్రప్రదేశ్ కు స్థానిక ఎన్నికలు అచ్చిరావడంలేదులా ఉంది. చంద్రబాబు విషయమే తీసుకుంటే తన ముమ్మారు ముఖ్యమంత్రి పాలనలో కేవలం ఒక్కసారే ఎన్నికలు జరిపించారు. వైఎస్సార్ తన అయిదేళ్ళ  పాలనలో ఒకసారి జరిపిస్తే కోర్టు ఆదేశాల తరువాత మాత్రమే  కాంగ్రెస్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి  2013లో ఎన్నికలు జరిపించారు. ఇప్పటికి అదే అఖరు సారి.

 

ఇక వైఎస్ జగన్ స్థానిక ఎన్నికలు జరిపించాలని ఆరాటపడుతున్నారు. ఆయన ఎంత త్వరగా స్థానిక ఎన్నికలు జరిపిస్తే అంత తొందరగా కేంద్ర నిధులు వస్తాయ‌ని భావించారు. అందుకే మార్చిలో ఒకేసారి ఎన్నికలకు రెడీ అయ్యారు. ఇక ఎన్నికలు వద్దు అంటూ టీడీపీ మొదటి నుంచి మొత్తుకుంటోంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు కూడా ఎన్నికలు వద్దు అంటూనే వచ్చాయి.

 

ఇపుడు వాయిదాతో ఆ ముచ్చట‌ సగం తీరింది. అయితే టీడీపీ, మిగిలిన పార్టీలు కోర్టుకు వెళ్ళి అయినా ఎన్నికలు రద్దు చేయించాలని చూస్తున్నాయి. ఇప్పటికైతే ఏకగ్రీవాలతో సగానికి సగం జెడ్పీలు వైసీపీ ఖాతాలో పడనున్నాయి. దాంతో ఎన్నికలను రద్దు చేసి మొదటి నుంచి జరిపించాలని చూస్తున్నాయి. 

 

ఈ విషయంలో చంద్రబాబు తన మెదడుకు పదును పెడుతున్నారు. మరో వైపు చూసుకుంటే ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైతం ఆరు వారాల గడువు పెట్టినా కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో ఎన్నికలు ఎపుడో చెప్పలేదు. ఇదొక అనుమానంగా ఉంటే ఎన్నికలు ఎపుడు జరిపినా కూడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సుప్రీం కోర్టు ఈసీని ఆదేశించింది.

 

ఇక ఎన్నికలు ఎపుడు పెట్టాలన్నది ఈసీ ఇష్టమే. దానికి సంబంధించి మాత్రమే ప్రభుత్వంతో తేదీల సంగతి చర్చిస్తారంతే. మరో వైపు కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేశామని నిమ్మగడ్డ చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో కరోనా కేసులు పెరుగుతాయి తప్ప తగ్గేది లేదు. దాంతో కరోనా తగ్గితేనే తప్ప ఎన్నికలకు వెళ్ళలేరు. ఇక ఏపీ సర్కార్ తో ఈసీకి లడాయి వచ్చింది కాబట్టి ఆయన ఎన్నికల ఊసు ఎత్తకుండా మరిన్నాళ్ళు నెట్టేసినా కూడా ఆశ్చర్యం లేదని కూడా అంటున్నారు. 

 

మొత్తం మీద సుప్రీం కోర్టు తీర్పు తరువాత చూసుకుంటే అసలు స్థానిక  ఎన్నికలు జరుగుతాయా అన్నది ఒక డౌట్ అయితే జరిగినా ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి జరుగుతాయా అన్నది మరో డౌట్. ఇక ఎన్నికలు ఏకంగా రద్దు చేసి మొదటి నుంచి జరిపిస్తారా అన్నది మరో డౌట్. మొత్తానికి వైసీపీకి ఈ పరిణామాలు షాకింగ్ గానే ఉన్నాయని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: