దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈరోజు సాయంత్రం భారత్ లో కరోనా కేసుల సంఖ్య 151కు చేరినట్లు ప్రకటన చేసింది. వీరిలో ఇప్పటివరకూ ముగ్గురు మృతి చెందగా 14 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకూ ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు కరోనా కట్టడిలో భాగంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 
 
ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలను గజగజా వణికిస్తున్న కరోనాపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, క్రైస్తవ ప్రవక్త కేఏ పాల్ స్పందించారు. చైనా కరోనా బాధితుల సంఖ్యను తక్కువగా చూపుతోందని అసలు నిజాలను బయటకు తెలీనీయడం లేదని చెప్పారు. దాదాపు 5 కోట్ల మంది చైనాలో కరోనా భారీన పడ్డారని అసలు నిజాలను చైనా వెల్లడించడం లేదని అన్నారు. 
 
చైనా చెబుతున్న లెక్కల కంటే అధికారికంగా 24 రెట్లు కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కరోనాకు ఇంతవరకూ మెడిసిన్ లేదని... కరోనా చాలా తీవ్రమైన సమస్య అని చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కే ఏ పాల్ తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల సీఎంలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. 
 
సంగారెడ్డి సమీపంలో తన చారిటికి చెందిన 300 గదులు, విశాఖ సమీపంలో 100 గదులు తనకు ఉన్నాయని చెప్పారు. కరోనా బాధితుల కోసం ఉచితంగా ఈ గదులను వాడుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంలకు పాల్ సూచించారు. కొన్ని రోజుల క్రితమే గదులను వాడుకోవాలని  కోరినా వారు తగిన రీతిలో స్పందించకపోవడంతో మీడియా ముఖంగా ఆఫర్ ఇస్తున్నానని అన్నారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: