వైసీపీకి ఉన్న 22 ఎంపీలలో 21 ఎంపీలది ఒక రూట్ అయితే, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మరో రూట్ అన్న సంగతి తెలిసిందే. ఈయన ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి అలాగే నడుస్తున్నారు. తనకు నచ్చినట్లు చేస్తారు తప్ప...పార్టీ అధిష్టానం లైన్‌లో మాత్రం అస్సలు నడవరు. ఈయనకు సొంత పార్టీ వైసీపీ నేతలతో పాటు, టీడీపీ, బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా ఢిల్లీలో కేంద్ర పెద్దలకు విందు ఇచ్చిన సమయంలో, పార్టీలో జగన్ మాట తప్ప ఇంకా ఎవరి మాట వినే ప్రసక్తి లేదని, పరోక్షంగా వైసీపీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి లక్ష్యంగా విమర్శలు కూడా చేశారు.

 

ఇక దీని తర్వాత తన సొంత జిల్లా వెస్ట్ గోదావరిలో  ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఓ సమావేశంలో ప్రోటోకాల్ పాటించలేదని చెప్పి, ఆ సమావేశం మధ్యలో నుంచి వెళ్ళిపోయి, మంత్రులపై విమర్శలు చేశారు. ఈ వివాదంతో స్వపక్షంలో విపక్ష నాయకుడుగా తయారైన నరసాపురం ఎంపీ, తాజాగా మరోసారి హాట్ కామెంట్స్ చేసి వైసీపీలో రచ్చ లేపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఎంపిక చేసే విషయంలో తనకు వ్యతిరేకంగా ఒక నిర్ణయం రాగా, తర్వాత అందులో దిద్దుబాటు చర్యలు జరిగి అనుకూలంగా నిర్ణయం వచ్చింది. ఇక ఇదే విషయాన్ని వైసీపీ కార్యకర్తలకు తెలియజేసే సందర్భంలో, అక్కడున్న కొందరు వైసీపీ కార్యకర్తలు జై జగన్, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

 

ఈ నినాదాలకు రఘురామకృష్ణం రాజు కాస్త అసంతృప్తిగా కనిపించారు. అయితే ఆ వెంటనే మరికొందరు కార్యకర్తలు రఘురామకృష్ణంరాజు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేయగా, ఒక కార్యకర్త మాత్రం మంత్రి చెరుకువాడ రంగనాథరాజు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదం చేసేసరికి, రఘురామకృష్ణం రాజుకు చిర్రెత్తుకొచ్చింది. ఎవడు నాయకత్వం కావాలి, నోరు మూసుకుని కూర్చో అంటూ ఎంపీ, కాస్త ఘాటు పదజాలం ఉపయోగించి తిట్టారు. ఇక ఇలా ఎంపీ తిట్టడంపై కార్యకర్తలు షాక్ అయ్యారు. ఈయన రూటే సెపరేట్ అనుకుంటూ సైలెంట్ అయిపోయారు. మొత్తానికైతే వైసీపీలో రఘురామకృష్ణంరాజు రూట్ సెపరేట్ లాగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: