దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 166 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనాను కట్టడి చేసేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెలాఖరు వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. తాజాగా ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 
 
మోదీ సూచనల మేరకు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ రేషన్ కార్డ్ కలిగిన కుటుంబాలు ఆరు నెలల సరుకులను ఒకేసారి తీసుకునే అవకాశం కల్పిస్తూ ప్రకటన చేశారు. బియ్యం, గోధుమలు, పంచదార, నూనె, ఇతర వస్తువులను ప్రజలు ముందుగానే తీసుకోవచ్చు. కరోనా ప్రభావం తో భారత్ కొన్ని రోజుల పాటు షట్ డౌన్ అయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆరు నెలల సరుకులను ముందుగానే ఇవ్వాలని సూచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 75 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలగనుందని తెలుస్తోంది. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే ఆరు నెలల రేషన్ సరుకులను ప్రజలకు ముందుగానే పంచి పెడుతోందని సమాచారం. 
 
ప్రస్తుతం వినియోగదారులు రేషన్ సరుకులను రెండు నెలలు ముందుగానే తీసుకునే సౌలభ్యం ఉంది. మరోవైపు శాస్త్రవేత్తలు దేశంలో కరోనా సెకండ్ స్టేజిలో ఉందని తెలిపారు. కరోనా వైరస్ సమూహ వ్యాప్తి దశకు చేరుకునేందుకు 30 రోజులు మాత్రమే ఉందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న కీలక దశలోనే కరోనాను అడ్డుకోవాలని లేదంటే భవిష్యత్తులో కరోనా వల్ల భారీ స్థాయిలో మరణాలు సంభవించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇటలీలో కరోనా భారీన పడి గడచిన 24 గంటల్లో 475 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఒక్క రోజులో అత్యధిక మరణాలు ఇటలీలోనే సంభవించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: