తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై, వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటోంది. పెద్ద‌గా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని అనుకుంటున్న త‌రుణంలో కరీంనగర్‌లో ఒక్క‌సారిగా కరోనా కలకలం సృష్టించింది. ఇండోనేషియా నుంచి క‌రీంన‌గ‌ర్‌కు వ‌చ్చిన  వచ్చిన పంది మందిలో ఏకంగా ఏడుగురికి కొవిడ్‌-19 పాజిటివ్‌ రావడంతో భ‌యాందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ ప్రభుత్వం తక్షణమే స్పందించి,  అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంచేసింది. సుమారు వంద వైద్య బృందాల‌ను రంగంలోకి దింపింది.  ఇండోనేషియా దేశస్థులు కరీంనగర్‌లో ఎక్కడెక్కడ సంచరించారో గుర్తించి ఆయా ప్రాంతాల్లో కట్టడికి చర్యలు చేపట్టింది. కరీంనగర్‌లో పూర్తిగా శానిటైజేషన్‌ చర్యలను చేపట్టింది. ఈ సంద‌ర్భంగా జిల్లాకు చెందిన మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని మంత్రి గంగుల కమలాకర్‌ విజ్ఞప్తిచేశారు.  ఎవ‌రికివారుగా స్వీయ ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.

 

అయితే, ఈనెల 14న‌ ఇండోనేషియాకు చెందిన ప‌దిమంది మ‌త‌ప్ర‌చార‌కులు కరీంనగర్‌కు వచ్చారు. సంప‌ర్క్ క్రాంతి రైలు ఎస్‌09 బోగీలో ఢిల్లీ నుంచి రామగుండం వచ్చారు. అక్క‌డి నుంచి వీరు ఆటోలో కరీంనగర్‌ చేరుకొన్నారు. అనంతరం స్థానికంగా ప‌లు మ‌సీదుల్లో మత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 16న వీరిని గుర్తించిన అధికారులు కరీంనగర్‌ జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. వెంట‌నే అక్కడి నుంచి హైదరాబాద్‌ గాంధీ దవాఖానకు పంపించారు. గాంధీ దవాఖానలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. వారి నమూనాలను పుణె వైరాలజీ కేంద్రానికి పంపించగా... బుధవారం పుణె నుంచి వచ్చిన నివేదికలో ఏడుగురికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో ఒక్క‌సారిగా క‌రీంన‌గ‌ర్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఇది పెద్ద‌స‌వాల్‌గా మారుతోంది. వారు ఎవ‌రెవ‌రిని క‌లిశారు, ఎక్క‌డెక్క‌డ తిరిగారు? ఆ రైలు బోగిలో ఎంత‌మంది ఉన్నారు..?  వారు ఏయే ప్రాంతాల‌కు చెందిన వారు..? ఇలా స‌వాల‌క్ష ప్ర‌శ్న‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ గురువారం అత్యున్న‌త‌స్థాయి మీటింగ్‌లో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: