కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో.. వందేళ్ల క్రితం వచ్చిన స్పానిష్ ఫ్లూ అందరికీ గుర్తొస్తోంది. భారత్ లో అయితే అప్పుడు వచ్చిన ఫ్లూకి.. ఇప్పుడు విస్తరిస్తున్న కరోనాకు చాలా దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే.. స్పానిష్ ఫ్లూ తరహాలో లక్షలాది మంది చనిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేస్తున్న తరుణంలో.. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ చేదు అనుభవాలు అందర్నీ కలవరపెడుతున్నాయి. మరీ ముఖ్యంగా మన దేశంలో స్పానిష్ ఫ్లూ చాలా దారుణమైన ప్రభావం చూపించింది. ఏకంగా దేశంలో ఆరు శాతం జనాభాను బలితీసుకుంది. సరైన పౌష్టికాహారం లేని మహిళలు ఎక్కువగా ఫ్లూ బారిన పడ్డారు. సౌతాఫ్రికా నుంచి వచ్చిన గాంధీజీకి కూడా ఫ్లూ సోకింది. అయితే అదృష్టవశాత్తు ఆయన ఫ్లూ నుంచి బయటపడ్డారు. 

 

బొంబాయికి సైనికుల్ని తీసుకొచ్చిన ఓ నౌక ద్వారా స్పానిష్ ఫ్లూ భారత్ కు వచ్చింది. ఇప్పుడు కూడా దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. బొంబాయిలో అప్పుడూ, ఇప్పుడూ జనాభా ఎక్కువే. జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే నగరం కాబట్టి.. గతంలో ఫ్లూ లాగే.. ఇప్పుడు కరోనా మరణాలు కూడా పెరుగుతాయనే ఆందోళన ఉంది. 

 

మొదట్లో కరోనా లాగే నెమ్మదిగా వ్యాపించిన ఫ్లూ.. ఆ తర్వాత భయకరమైన ప్రభావం చూపించింది. ఫ్లూ విస్తరించిన మూడు నెలల తర్వాత మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. భారత్ లో ఏకంగా కోటిన్నర మంది ప్రాణాలు తీసింది స్పానిష్ ఫ్లూ. అప్పట్లో భారతీయ సమాజంలో నిరక్షరాస్యత, అపరిశుభ్ర వాతావరణం ఎక్కువగా ఉండటం కూడా ఫ్లూ మరణాల రేటును పెంచింది. అప్పటి బ్రిటీష్ ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా దీనికి తోడైంది. 

 

అయితే స్పానిష్ ఫ్లూ కారణంగాగ అంతకుముందు దేశంలో ఎప్పుడూ జరగని విషయం ఒకటి జరిగింది. చదువుకున్నవాళ్లు ముందుకొచ్చి బాధ్యత తీసుకున్నారు. ఇన్ ఫ్లుయెంజా కమిటీలు ఏర్పడి.. సాటి పౌరులకు ఫ్లూపై అవగాహన  కలిగించాయి. ఇప్పుడు కరోనా విస్తరిస్తున్న తరుణంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు ముమ్మరంగా జరగాల్సిన అవసరం చాలా ఉంది. కేవలం ప్రభుత్వమే కరోనాను కంట్రోల్ చేయలేదు. పౌరుల భాగస్వామ్యం కూడా విస్తృతంగా ఉండాల్సిందే. 

 

స్పానిష్ ఫ్లూ వచ్చేనాటికీ ఇంకా యాంటీ బయాటిక్స్ అందుబాటులోకి రాలేదు. కానీ ఇప్పడు కరోనా కాలంలో విస్తృతమైన యాంటీ బయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. అప్పటితే పోలిస్తే ఇప్పుడు దేశంలో అక్షరాస్యత, పరిశుభ్రత కూడా గణనీయంగా మెరుగయ్యాయి. ప్రభుత్వం కూడా మిగతా దేశాల కంటే వేగంగానే చర్యలు తీసుకుంటోంది. కానీ పౌరులు కరోనాను సీరియస్ గా తీసుకుంటున్నారా.. లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. స్పానిష్ ఫ్లూ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: