మనిషి భయమే మరో మనిషిక పెట్టుబడి అంటుంటారు.. భయాన్ని క్యాష్ చేసుకోవడంలో కొంత మంది కేటుగాళ్లు చిత్ర విచిత్రమైన పన్నాగాలు పన్నుతుంటారు.   ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ కరోనా నుంచి కాపాడుకునేందుకు మాస్క్, శానిటైజర్లు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.  అయితే మార్కెట్ లో మాత్రం ఇవి అంత సులభంగా లభ్యమయ్యేలా లేవు.. ఎందుకంటే వాటిని కొంత మంది బ్లాక్ మార్కెట్ చేయడంలో విపరీతమైన గిరాకీ పెరిగిపోయింది. మొన్నటి వరకు మాస్క్ కేవలం రూ.5 మాత్రమే ఉంటే.. ఇప్పుడు రూ.50 కి పైమాటే అంటున్నారు.  ఇక శానిటైజర్లకు రూ. 200 కు పైగా అమ్ముతున్నారు.  మొత్తానికి కరోనా ప్రభావంతో మాస్క్‌లు, శానిటైజర్లకు విపరీతంగా డిమాండ్‌ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే కొందరు కేటుగాళ్లు అక్రమదందాకు తెరలేపారు.   

 

నకిలీ శానిటైజర్లు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు, తెలంగాణ ఆయుష్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో జరిపిన సోదాల్లో డూప్లికేట్ హ్యాండ్ శానిటైజర్ తయారీ ముఠాగుట్టు రట్టు చేశారు. లక్షల విలువ చేసే నకిలీ శానిటైజర్, ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్లపల్లి ప్రాంతంలో అనుమతి లేకుండా రసాయనాలు తయారు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో ఓ ఇంట్లో తనిఖీ చేశారు పోలీసులు.  అక్కడ  నకిలీ శానిటైజర్ల తయారీ కోసం సిద్ధం చేసిన రసాయనాలు ఉన్నట్టు గుర్తించారు. వాటిని, అట్టపెట్టెలో నింపి పంపిణీకి సిద్ధంగా ఉన్ననకిలీ శానిటైజర్లను స్వాధీనం చేసుకున్నారు.

 

 100మి.లీ శానిటైజర్ల 25 వేల యూనిట్లు, ఫేస్ మాస్క్‌లు, రూ. 40 లక్షల విలువైన ముడి పదార్థాలను సీజ్ చేశారు.  అయితే ప్రజలు ఇలాంటి విషయాల్లో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇలాంటి కెమికల్స్ వాడితే కరోనా సంగతి దేవుడెరుగు కొత్త రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మరోవైపు రాచకొండలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, రూ. 10 లక్షల విలువైన 2,500 నకిలీ శానిటైజర్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: