ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మెల్లగా ఏపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ప్రపంచ దేశాలతో సహ మన దేశ ప్రభుత్వం కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన పెంచుతుంది. కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు చెబుతుంది. అలాగే పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంచుతుంది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దీనిపై నిత్యం సమీక్ష చేస్తున్నారు. 24 గంటలు ఆరోగ్య శాఖ పరిధిలోని అధికారులతో మాట్లాడుతూ, తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెట్టి ప్రజలని అప్రమత్తం చేస్తున్నారు

 

అయితే ఏపీలో మాత్రం ఈ కరోనా వైరస్ పట్ల ప్రజలని అప్రమత్తం చేసే కార్యక్రమాలు పెద్దగా చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినప్పుడు మాత్రం సీఎం జగన్ కరోనా వైరస్ గురించి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. కానీ ఏపీ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఆళ్ళ నాని ఇంతవరకు దీనిపై పెద్దగా స్పందించినట్లు కనిపించ లేదు. అంతర్గతంగా ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశాలు పెడుతున్నారేమో గానీ, బయటకొచ్చి మీడియా ముందు ఈ కరోనా ప్రభావం ఏపీపై ఎలా ఉంది. ఇప్పటివరకు ఎంతమంది బాధితులు ఉన్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామనే విషయాన్ని మాత్రం చెప్పిన దాఖలాలు లేవు.

 

కాకపోతే ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి కరోనాపై సమీక్షలు చేస్తూ బులెటిన్‌లు విడుదల చేస్తున్నారు. అయితే మంత్రి మాత్రం పెద్దగా స్పందించినట్లు కనిపించడం లేదు. ఇక ఇదే విషయంపై ఏపీ ప్రజలు మనకు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అసలు మన ఆరోగ్య శాఖ మంత్రి ఎవరనే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. అంటే ఆళ్ళ నాని గురించి రాష్ట్రంలో పెద్దగా తెలియదనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఆళ్ళ నాని అడ్రెస్ ఎక్కడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి సమయాల్లో ఆళ్ళ నాని మరింత యాక్టివ్‌గా ఉంటే మంచిదేమో

మరింత సమాచారం తెలుసుకోండి: