ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు... భారత్‌లో కూడా కరోనా మరణాల సంఖ్య పెరుగుతోంది. పంజాబ్‌లో ఇవాళ నాలుగో మరణం సంభవించింది. చనిపోయినవారంతా 60 ఏళ్ల పైబడినవారే..! దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యాయి.

 

భారత్‌లో కరోనా తీవ్ర కలకలం రేకిత్తిస్తోంది. రోజురోజుకూ బాధితులు పెరిగిపోతుండగా.. తాజాగా మరో మరణం కూడా సంభవించింది. పంజాబ్‌లో70 ఏళ్ల వృద్ధుడు కోవిడ్‌ 19 బారిన పడి కన్నుమూశారు. ఇటీవలే ఈయన విదేశాల నుంచి వచ్చినట్లు సమాచారం. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా మరణాన్ని ధృవీకరించింది. తాజా మరణంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.

 

గతంలో కర్నాటకలో తొలి మరణం సంభవించింది. సౌదీ అరేబియా నుంచి 76 ఏళ్ల వృద్ధుడు కలబుర్గిలో కన్నుమూశారు.  జనవరి 29న సౌదీ వెళ్లిన ఆయన ఫిబ్రవరి 29న హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆ తర్వాత కలబుర్గి వెళ్లినట్లు తేలింది. కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయన మార్చి 10వ తేదీ చనిపోయారు.. ఇదే భారత్‌లో కరోనా వైరస్‌ వల్ల కలిగిన తొలి మరణం.

 

ఇక రెండో మరణం ఢిల్లీలో చోటుచేసుకుంది. 69 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ చనిపోయింది. యూరోప్‌ నుంచి నుంచి వచ్చిన ఆమె కుమారుడి ద్వారా ఆమెకు ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. అప్పటికే ఆమె బీపీ, షుగర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో మార్చి 13వ తేదీన ఆమె రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రిలో కన్నుమూశారు.

 

ఇక మూడో మరణం మార్చి 17న ముంబైలో జరిగింది. కరోనాతో బాధపడుతూ 64 ఏళ్ల వృద్ధుడు కన్నుమూసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని రోజుల కిందటే ఈయన దుబాయ్‌ నుంచి వచ్చినట్లు గుర్తించారు.

 

ఇప్పటివరకూ జరిగిన మరణాలన్నీ 60 ఏళ్ల వయసు పైబడినవారివే! దీంతో రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. వృద్ధులు, చిన్నారులు ఇళ్లు దాటి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్యం ఉన్నా, కరోనా లక్షణాలున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: