ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు మళ్ళీ మొదలు అయ్యాయా? గోదావరి పరివాహక ప్రాంతాల్లో పట్టుకోసం అన్నలు యత్నిస్తున్నారా..? తాజా పరిణామాలతో అనుమానాలకు బలం చేకూరుతోంది. పరివాహక ప్రాంతాల్లో నిఘా పెంచిన పోలీసులు.. ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. మరోవైపు స్వయంగాడీజీపీ రంగంలోకి దిగి సమీక్షలు నిర్వహించడంతో పాటు...  ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


ఉత్తర తెలంగాణ .. ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డా.. తర్వాతి కాలంలో ప్రభుత్వాలు కూంబింగ్, ఇతర కార్యకలాపాల ద్వారా ఉక్కుపాదం మోపడంతో.. ఇక్కడ మావోయిస్టుల కదలికలుపూర్తిగా సద్దుమణిగాయి.  దీంతో కొంత కాలంగా ఈ ప్రాంతం స్తబ్దుగా మారింది. అయితే ఇటీవలి కాలంలో  అన్నల కదలికలు క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మళ్లీ పట్టు కోసం మావోలు యత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

 

దండకారణ్యంలో మావోయిస్టుయాక్షన్ టీంలు దిగాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఫిబ్రవరి రెండోవారంలో చత్తీస్ గడ్ పోలీసులు  ఆపరేషన్ ప్రహార్ చేపట్టడంతో...అక్కడి నుంచి మావోలు తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందని నిఘావర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి.ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల సరిహద్దు, గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి నాలుగు యాక్షన్ టీంలు ప్రవేశించినట్లు పోలీసులు ధ్రువీకరిరంచారు. గతంలో మావోయిస్టులు శత్రువులుగా ప్రకటించిన టార్గెట్లుగా పేర్కొన్నవారు.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, కొత్తగూడ, గుండాల, ఖమ్మం ఏరియాల్లోకి ఈ టీములు వెళ్లినట్లు సమాచారం.ఒక్కో టీంలో ఎనిమిది నుంచి పదిమంది సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. మావోల చొరబాటుకు వీలుండే పలిమెల, మహాముత్తారం మండలాల్లో పర్య టించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.  ప్రస్తుతం గోదావరి పరివాహక మండలాల్లో మిర్చి సీజన్ నడుస్తోంది. పంటకోత దశకు రావడంతో చాలామంది రైతులు ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర నుంచి కూలీలను తీసుకువస్తున్నారు. కూలీల మాటున మావోలు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదని పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. మావోల అలజడి పెరిగింది అన్న సమాచారం తో పోలీసు బాస్ రంగం లోకి దిగారు.

 

ములుగు తో పాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాలో స్వయంగా పర్యటించి జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తూ.. నకల్స్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు .. నక్సల్స్ సానుభూతి పరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఛత్తీస్ గడ్ నుంచి ములుగు, భూపాల్ పల్లి జిల్లాకు తరలివచ్చిన గొత్తికోయల కదలికలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో గొత్తికోయగూడేలలోని నివసించే వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. గొత్తికోయగూడేల్లో ఛత్తీస్ గడ్ క్యాడర్ కు చెందిన మావోయిస్టులు ఆశ్రయం పొందారన్న సమాచారంతో ఆ గూడేలను జల్లెడపడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: