ఒకే ఒక్క ఓటమి తెలుగుదేశం పార్టీని దారుణంగా దెబ్బతీసింది. మొన్నటివరకు అధికారంలో ఉండగా చంద్రబాబు చుట్టూనే ఉన్న నేతలంతా వరుస పెట్టి పార్టీ మారిపోయారు. తమ అనుకూలం బట్టి బీజేపీ, వైసీపీల్లోకి వెళ్ళిపోయారు. సార్వత్రిక ఎన్నికలు అయ్యాక మొదలైన ఈ వలసలు..ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలు వాయిదా పడినా,  నేతలు మాత్రం టీడీపీకి షాక్ ఇవ్వడం ఆపలేదు. ఇప్పటికే బడా నేతలంతా వైసీపీలోకి వెళ్ళిపోయారు.

 

ఆఖరికి దశాబ్దాల పాటు టీడీపీలో కొనసాగిన నేతలు కూడా పార్టీని వీడారు. ఇక ఈ క్రమంలోనే టీడీపీని మరో బడా నేత వీడటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి సైకిల్ దిగిపోయే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే కృష్ణమూర్తి సోదరుడు ప్రభాకర్ టీడీపీని వీడారు. ఇక ఇప్పుడు కృష్ణమూర్తి కూడా పార్టీని వీడిపోవచ్చని ప్రచారం జరుగుతుంది.

 

ఎప్పుడైతే కోట్ల ఫ్యామిలీ టీడీపీలోకి వచ్చిందో అప్పటి నుంచి కెఈ ఫ్యామిలీ అసంతృప్తిగా ఉంది. జిల్లాలో వారి పెత్తనమే ఎక్కువైపోయిందని ఫీల్ అవుతున్నారు. ఇక ఇదే విషయం చెప్పి కెఈ ప్రభాకర్ పార్టీని వీడారు. ఇక తమ్ముడు పార్టీని వీడటంతో కృష్ణమూర్తి కూడా కుమారుడు భవిష్యత్ కోసం టీడీపీని వదిలేసే అవకాశముందని తెలుస్తోంది. కృష్ణమూర్తికి ఎలాగో వయసు మీద పడటంతో రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండటం లేదు.

 

అందుకే 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా కుమారుడు శ్యాంబాబుకు టికెట్ ఇప్పించుకున్నారు. అయితే శ్యామ్ పత్తికొండ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన దగ్గర నుంచి శ్యామ్ పార్టీలో అడ్రెస్ లేరు. అటు కెఈ కూడా పెద్ద యాక్టివ్‌గా లేరు. తాజాగా ప్రభాకర్ పార్టీని వీడినప్పుడు మాత్రం స్పందించారు. వైసీపీలో చేరితే అభ్యంతరం లేదన్నట్లు మాట్లాడారు. ఇక అప్పటి నుంచే కృష్ణమూర్తి కూడా కుమారుడు కోసం సైకిల్ దిగోపోయే అవకాశాలున్నాయని కర్నూలు జిల్లాలో చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: