మనషులు ప్రాణాలు హరించే మహమ్మారి కరోనా వైరస్ ఏపీ రాజకీయాలని హీటెక్కిస్తుంది. ఓ వైపు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు కరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలని చెబుతూనే రాజకీయం కూడా చేస్తున్నాయి. అసలు కరోనా ప్రభావం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన దగ్గర నుంచి, ఈ రెండు పార్టీల మధ్య కరోనా రాజకీయం మొదలైంది. ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్, చంద్రబాబు చెప్పినట్లు విని కరోనా సాకు చెప్పి, ఎన్నికలు వాయిదా వేయించారని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.

 

అసలు కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంటే అధికార వైసీపీ బుద్ధి లేకుండా ఎన్నికలు కావాలి అంటుందని టీడీపీ నేతలు విమర్శలు చేశారు. గత ఐదు రోజులుగా ఈ కరోనా వైరస్, స్థానిక సంస్థలు, ఎలక్షన్ కమిషనర్ మీద రాజకీయం నడుస్తూనే ఉంది. ఎన్నికలు వాయిదా పడటం, వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళడం, అక్కడ ఎన్నికల సంఘం నిర్ణయానికి అనుకూలంగా తీర్పు రావడం, నెక్స్ట్ తనపై దాడి జరగొచ్చని నిమ్మగడ్డ కేంద్రానికి లేఖ రాశారనే వార్త బయటకు రావడం, అది ఫేక్ అని వైసీపీ, కాదు నిజమని టీడీపీ వాదించుకోవడం జరిగాయి.

 

ఈ రాజకీయం ఇలా జరుగుతుండగానే, వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు వైరస్ పేరు పెట్టుకుని విమర్శలు చేసుకోవడం చేస్తున్నారు. రాష్ట్రానికి జగరోనా వైరస్ పట్టిందని టీడీపీ వాళ్ళు అంటుంటే, కరోనా కంటే చంద్రబాబు పెద్ద వైరస్ అని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ కరోనా రాజకీయంలో అతి దరిద్రమైన విషయం ఏమిటంటే? వీరి రాజకీయంలోకి సీఎం జగన్ కుమార్తెలని లాగడం. చంద్రబాబుతో సహ టీడీపీ నేతలు జగన్ కుమార్తెలు కూడా విదేశాల నుంచి వచ్చారని అంటున్నారని, అలా వచ్చి ఉంటే వారినీ 14 రోజుల పర్యవేక్షణలో పెట్టాలని మాట్లాడారు.

 

ఇక బుద్దా వెంకన్న అయితే... అసలు కరోనా పెద్ద విషయమే కాదు అన్న జగన్, ఆయన ఇద్దరు కుమార్తెలను లండన్ నుండి ఎందుకు వెనక్కి పిలిపించారని ప్రశ్నించారు. అంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్లేదు కానీ.. రాష్ట్రంలో ఉన్న పిల్లలు కరోనా బారిన పడినా పర్లేదా అంటూ ఫైర్ అయ్యారు. అయితే కరోనా ప్రభావం ఎలా ఉన్నా, టీడీపీ నేతలు మాత్రం జగన్ కుమార్తెలని రాజకీయంలోకి లాగడం కరెక్ట్ కాదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: