ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయింది... పొల్యూషన్‌ కారణంగా రోజురోజుకు చస్తూనే ఉన్నాం...ఇక ఉరి తీయడం ఎందుకు..? నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్‌ ఠాకూర్ ఉరిశిక్ష తప్పించుకునేందుకు సుప్రీం కోర్టు ముందు ఇలా కూడా వాదించాడు. బీహార్‌లో పుట్టి పెరిగి ఉపాధి కోసం ఢిల్లీ వచ్చిన అక్షయ్... నిర్భయ అత్యాచార ఘటనలో జైలుపాలయ్యాడు. 

 

అక్షయ్‌ ఠాకూర్... ప్రస్తుతం 36యేళ్ల వయస్సు... నిర్భయ ఘటన జరిగినప్పుడు 28 యేళ్లు. తమలాగా కష్టాలు పడకూడదని తల్లిదండ్రులు స్కూల్‌కు పంపించారు... పెద్ద చదువులు చదివితే వ్యవసాయ కూలీలుగా బతకాల్సిన అవసరం ఉండదని... అక్షయ్‌ ఠాకూర్‌ను బడికి పంపారు.కానీ అక్షయ్‌కు చదువు అబ్బలేదు. మధ్యలోనే మానేశాడు...గాలి తిరుగుడు తిరుగుతూ కుటుంబానికి భారంగా మారాడు... చివరకు పొట్ట కూటికోసం బస్సులు, లారీల్లో హెల్పర్‌గా చేరాడు. 

 

అక్షయ్ ఠాకూర్ కుటుంబం మొత్తం బీహార్‌లోనే నివస్తోంది. పాట్నాకు సమీపంలో లహన్‌కర్మా గ్రామంలో పుట్టాడు అక్షయ్‌ ఠాకూర్. నిర్భయ అత్యాచార ఘటన జరగడానికి సంవత్సరం ముందే బీహార్ నుంచి మకాం ఢిల్లీకి మార్చాడు. భార్యతో పాటు కొడుకును బీహార్‌లోనే వదిలేసి... ఢిల్లీకి వచ్చాడు....ప్రైవేటు బస్సుల్లో కాంట్రాక్ట్ హెల్పర్‌గా చేరాడు. ఢిల్లీలో ఇతనికి ఓ ఇల్లు అంటూ ఏమీ లేదు... ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు... ఒక్కోసారి తాను పనిచేస్తున్న బస్సుల్లోనే పడుకుని నిద్రపోయేవాడు. 

 

2012 డిసెంబర్ 16న నిర్భయపై కదులుతున్న బస్సులో అత్యాచారం జరిగినప్పుడు అదే బస్సులో హెల్పర్‌గా ఉన్నాడు అక్షయ్ ఠాకూర్. మిగతా స్నేహితులతో కలిపి నిర్భయపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిర్భయ స్నేహితుడిని కూడా తీవ్రంగా గాయపరిచాడు. చేసిన తప్పు ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఘటనాస్థలం నుంచి సాక్ష్యాధారాలను మాయం చేశాడు.

 

నిర్భయపై అత్యాచారం జరిగిన తర్వాత బస్సు మొత్తం నీళ్లతో కడిగాడు అక్షయ్‌ కుమార్. తాము చేసిన పాపపు పని అక్కడితో తుడిచిపెట్టుకుపోతుందనుకున్నాడు. అయితే నిర్భయ ఘటన జరిగిన ఐదు రోజులకే  అక్షయ్‌ ఠాకూర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య, అత్యాచారంతో పాటు కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. 

 

అయితే తాను అత్యాచార ఘటన జరిగినప్పుడు ఢిల్లీలో లేనని వాదించాడు అక్షయ్ ఠాకూర్.  15 డిసెంబర్ 2012న ఢిల్లీ వదలి  బీహార్ వెళ్లానని చెప్పుకొచ్చాడు. కానీ సాక్ష్యాధారాలన్నీ అతను చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. నిర్భయపై దాడి చేసిన తర్వాత దోషులంతా తలోదారిన పారిపోయాడు. తానేపాపం తెలియనట్టు అమాయకంగా ఢిల్లీ నుంచి బీహార్ వెళ్లిపోయాడు అక్షయ్.  కుటుంబంతో పాటు స్నేహితులతో గడిపాడు... అయితే అక్షయ్‌ పాత్రపై పూర్తి వివరాలు సేకరించిన ఢిల్లీ పోలీసులు బీహార్‌ వెళ్లి అక్షయ్‌ను అరెస్ట్ చేశారు.

 

నిర్భయపై అత్యాచారం చేసిన వాళ్లల్లో అక్షయ్ ఠాకూర్ కూడా ఉన్నాడని రుజువు చేసేందుకు అనేక శాస్త్రీయ పద్దతులను ఫాలో అయ్యారు పోలీసులు.  పంటి గాటు గుర్తులను ఫోరెన్సిక్ సాక్ష్యంగా వాడిన దేశంలోని తొలికేసు ఇదే. వేలిముద్రల తరహాలోనే ప్రతి వ్యక్తి  పళ్లు ప్రత్యేకంగా ఉంటాయి. నిర్భయ శరీరంపై ఉన్న పంటి గాటులు అక్షయ్ ఠాకూర్‌ , రామ్ సింగ్‌విగా గుర్తించిన పోలీసులు డేంటల్ ఫీచర్స్‌ ఆధారంగా కేసు నమోదు చేశారు.

 

ఉరికంబం ఎక్కకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు అక్షయ్ ఠాకూర్. ఢిల్లీ కాలుష్యంతోనే సగం చచ్చిపోతున్నాం ఇక ఉరితీయడం ఎందుకంటూ సుప్రీంలో పిటిషన్ వేశాడు. రాష్ట్రపతి ముందు రెండు సార్లు క్షమాభిక్ష పిటిషన్లు వేశాడు. అయినా అతని ప్రయత్నాలు ఫలించలేదు. అయితే మిగతా దోషులతో పోల్చితే తీహార్ జైల్లో కుదురుగానే ఉన్నాడు అక్షయ్ ఠాకూర్... జైల్లో పనిచేసినందుకు 69వేలు కూడా సంపాదించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: