అనేక మలుపుల మ‌ధ్య‌ నిర్భ‌య దోషుల‌కు ఎట్ట‌కేల‌కు ఉరిశిక్ష‌ను అమ‌లు చేశారు. నలుగురు దోషులు ముఖేశ్‌ సింగ్‌(32), పవన్‌ గుప్తా(25), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌(31)ను ఢిల్లీలోని తీహార్‌ జైల్లో శుక్రవారం ఉదయం 6:30 గంటలకు ఉరి తీశారు.   2012 డిసెంబర్‌ 16వ తేదీ రాత్రి ఢిల్లీలో కదిలే బస్సులో నిర్భయపై దారుణ ఘ‌ట‌నతో దేశం ఉలిక్కిప‌డింది. ఈ దారుణ ఘ‌ట‌న‌తో దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కొన‌సాగాయి. అయితే, ఈ దోషులు జైలులో ప‌ని చేసి ఈ ఏడేళ్ల కాలంలో త‌లాకొంత సంపాదించారు. ఉరిశిక్ష అమ‌లు అనంత‌రం వీరు సంపాదించిన వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. జైలు శిక్ష అనుభవిస్తున్న కాలంలో న‌లుగురు దోషుల మొత్తం సంపాదన రూ.1,37,000. అక్షయ్‌ రూ. 69 వేలు సంపాదించగా, పవన్‌ రూ. 29 వేలు, వినయ్‌ రూ. 39 వేలు సంపాదించాడు. ఇక‌ ముఖేష్‌ ఎలాంటి పని చేయలేదు. 

 

ఈ ఏడేళ్ల కాలంలో ఈ నలుగురు 23 సార్లు జైలు నిబంధనలు ఉల్లంఘించినట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.  జైలు నిబంధనలు ఉల్లంఘించినందుకు వినయ్‌ శర్మ 11 సార్లు, అక్షయ్‌ ఒక సారి శిక్షను అనుభవించాడు. ఇక ముఖేష్‌ మూడు సార్లు, పవన్‌ ఎనిమిది సార్లు జైలు నిబంధనలను ఉల్లంఘించాడు. ఇక వీరి చ‌దువుకు సంబంధించిన వివ‌రాలు కూడా తెలుస్తున్నాయి. 2016లో ముఖేష్‌, పవన్‌, అక్షయ్‌.. పదో తరగతిలో అడ్మిషన్‌ తీసుకున్నప్పటికీ వారు పాస్‌ కాలేదు. 2015లో వినయ్‌ బ్యాచిలర్‌ డిగ్రీలో అడ్మిషన్‌ తీసుకున్నాడు.. కానీ పూర్తి చేయలేదు. కాగా, ఉరి కంబం వద్దకు తీసుకెళ్లే కంటే ముందు నలుగురు దోషులు వెక్కివెక్కి ఏడ్చిన‌ట్లు జైలు అధికారులు తెలిపారు. తమకు కేటాయించిన సెల్స్‌లో దోషులు కంటతడి పెట్టిన‌ట్లు పేర్కొన్నారు. కోర్టు ఆదేశించిన సమయం ప్రకారమే ఉదయం 5:30 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దీన్‌దయాల్‌ ఆస్పత్రికి తరలించారు. ఒక వేళ వారి కుటుంబ సభ్యులు మృతదేహాలను తీసుకెళ్లేందుకు ముందుకు రాకపోతే... పోలీసులే అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: