ఏపీ రాజ‌కీయాలు కీల‌క ద‌శ‌కు చేరుకున్నాయి. స్థానిక ఎన్నిక‌లు వాయిదా.. త‌ద‌నంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌కు తోడు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ త‌న‌కు ప్రాణ‌హాని ఉందంటూ.. నేరుగా కేంద్ర హోం శాఖ‌కే రాశార‌ని అంటున్న‌(దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు) లేఖ వంటివి తీవ్ర రాజ‌కీయ దుమారం రేపాయి. దీంతో వైసీపీ-టీడీపీల మ‌ధ్య పొలిటిక‌ల్ టెంప‌రేచ‌ర్‌ 1000 డిగ్రీలు దాటింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నిజానికి స్థానిక ఎన్నిక‌ల వాయిదా వెనుక టీడీపీ ఉంద‌ని వైసీపీ, వైసీపీ దాడుల కార‌ణంగానే ఎన్నిక‌లు వాయిదా వేశార‌ని టీడీపీ ఆరోపించుకున్నాయి. అయితే, ఇది సుప్రీం కోర్టుకు కూడా  వెళ్లిన విష‌యం తెలిసిందే.

 

అయితే, అనూహ్యంగా టీడీపీ మాట మార్చింది. కేవ‌లం క‌రోనా వైర‌స్ కార‌ణంగానే ఎన్నిక‌ల‌ను వాయిదా వేశా రంటూ.. సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చేసిన ప్ర‌భుత్వ దాడులు, వైసీపీ నేత‌ల దూకుడు వంటివి వ‌ట్టి మాట‌లేన‌ని స్ప‌ష్ట‌మైంద‌ని ప‌రిశీల‌కులు అంటు న్నారు. ఇక‌, ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కూడా నిజానికి త‌న భ‌ద్ర‌త‌పై సందేహాలు ఉంటే.. త‌న‌కు నిజంగానే ఏదైనా స‌మ‌స్య ఉంటే.. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి చెప్పి ఉండాలి. లేదా గ‌వ‌ర్న‌ర్‌కు (ఆయ‌న‌ను నియ‌మించింది గ‌వ‌ర్న‌ర్ కాబ‌ట్టి) ఫిర్యాదు చేసి ఉండాలి. కానీ, ఆయ‌న నేరుగా కేంద్ర హోం శాఖ‌కు ఫిర్యాదు చేయ‌డం కూడా రాజ‌కీయంగా మంట‌లు రేపింది.

 

ఈ ప‌రిణామాలు ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో వైసీపీ-టీడీపీల‌కు మ‌ధ్య ఉన్న గ్యాప్‌ను మ‌రింత‌గా పెంచ‌డం తో పాటు రాజ‌కీయంగా కూడా తీవ్ర వైరం పెంచింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఇప్ప‌టికే అనేక రూపాల్లో విమ‌ర్శ‌లు చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు పూర్తిగా జ‌గ‌న్‌ను పాల‌నార‌హితుడిగా నిరూపించాల‌నే కంక‌ణం క‌ట్టుకున్నార‌ని అందుకే ఇలాంటి ప‌రిస్థితులు క‌ల్పిస్తున్నార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. నిజంగానే ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు భ‌ద్ర‌త లేక పోతే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఎందుకు చెప్ప‌లేదు?  రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉంద‌ని దానికి ఆయ‌న చెప్పాల‌నే స్పృహ ఎందుకు క‌ల‌గ‌లేద‌నే ప్ర‌శ్న‌లు కూడా తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇదంతా కూడా టీడీపీ ఆడిస్తున్న నాట‌కంలో భాగ‌మ‌నే వైసీపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌కు బ‌లం చేకూరుస్తోంది. మ‌రి మున్ముందు ఈ రెండు పార్టీల మ‌ధ్య ప‌రిణామాలు మ‌రింత రాజుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: