దేశంలో సంచ‌ల‌నం సృష్టించిన‌ నిర్భయ గ్యాంగ్‌రేప్‌ కేసులో నలుగురు దోషులు ముఖేశ్‌ సింగ్‌(32), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ ఠాకూర్‌ సింగ్‌(31), పవన్‌ గుప్తా(25)ల‌ను తీహార్ జైలులో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ తలారీ పవన్ జల్లాడ్ శుక్రవారం ఉదయం ఉరి తీశారు. ఉరితీసిన తర్వాత తలారీ ప‌వ‌న్ జ‌ల్లాడ్‌ మీడియాతో మాట్లాడుతూ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ‘‘నలుగురు దోషులను ఉరి తీసిన తర్వాత నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ క్షణం కోసం నేను చాలా కాలం వేచి ఉన్నాను.’’ అని తలారీ పవన్ జల్లాడ్ చెప్పారు. కాగా, శుక్రవారం ఉదయం నిర్భయ దోషులైన ముఖేశ్‌ సింగ్‌, వినయ్‌ శర్మ, అక్షయ్‌ ఠాకూర్‌ సింగ్‌, పవన్ గుప్తా లకు ఉరివేసిన తర్వాత 30 నిమిషాల పాటు అలా ఉరికంబాలపై ఉంచారు. అనంతరం నలుగురు దోషులను కిందకు దించి వారిని వైద్యులు పరీక్షించగా నలుగురూ మరణించారని తేలింది. 

 

అంత‌కుముందు ఉరితీసే ప్ర‌క్రియ ఇలా కొన‌సాగింది. శుక్ర‌వారం తెల్లవారుజామున 4.00 గంటలు : తిహార్ జైలు అధికారులు నిర్భయ కేసులో నలుగురు దోషులను నిద్ర లేపి, స్నానం చేయాలని కోరారు. తెల్లవారుజామున 4.15 గంటలు : ఉరికి ముందు చివరిసారిగా దేవుడ్ని తలచుకొని పూజలు చేయాలని సూచించిన జైలు సిబ్బంది...నిరాకరించిన దోషులు, జైలు అధికారులు నలుగురు దోషులకు అల్పాహారం సర్వ్ చేశారు. తెల్లవారుజామున 4.30  గంటలు: నలుగురు దోషులను ఉరికంబం ఎక్కించే ముందు వైద్యపరీక్షలు...తిహార్ జైలు సూపరింటెండెంట్ మరణశిక్ష నిలిపివేయగల లేఖ లేదా నోటీసు ఏదైనా వచ్చిందా అని తనిఖీ, అలాంటి లేఖ రాలేదని ధ్రువీకరణ. తెల్లవారుజామున 5.20 గంటలు : దోషుల ముఖాలను వస్త్రంతో కప్పి, చేతులు వీపు వెనకు కట్టి తిహార్ జైలు కాంప్లెక్స్ లోని ఉరికంబాల వద్దకు తరలించారు. ఉదయం 5.25 గంటలు : ఉరికంబం ఎక్కించే ముందు జిల్లా మెజిస్ట్రేట్ దోషుల కోరికను అడిగారు...దోషుల డెత్ వారెంటుపై కౌంటర్ సంతకం చేశారు. ఉదయం 5.40 గంటల సమయం : నిర్భయ నలుగురు దోషులకు మరణశిక్ష విధించారు. నలుగురు దోషులను ఉరి తీసినట్లు తిహార్ జైలు డైరెక్టరు జనరల్ సందీప్ గోయెల్ ధ్రువీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: