ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గతంలో ఈసీ ఇళ్ల పట్టాల పంపిణీని ఏప్రిల్ 14 వరకు అమలు చేయకూడదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా సుప్రీం ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో పాటు పాత పథకాలను ప్రభుత్వం యథావిథిగా అమలు చేయవచ్చని పేర్కొంది. కొత్త పథకాలను అమలు చేయాలంటే మాత్రం ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని సూచించింది. 
 
ఏపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ పథకం పాత పథకమేనని... ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ను కోరింది. ఎన్నికల కమిషన్ పథకం అమలుకు అంగీకరించింది. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీకి తమకు అభ్యంతరం లేదని రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కానీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ ఉండటంతో జగన్ తాత్కాలికంగా ఈ పథకం అమలుకు బ్రేక్ వేశారు. 
 
మొదట నిర్ణయించిన ప్రకారం ఉగాది పండుగ రోజున ఈ పథకం అమలు కావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14న ఈ పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇప్పటివరకూ మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొందరు అనుమానితుల రిపోర్టులు ఇంకా అందాల్సి ఉంది. ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు చేపట్టింది. 
 
రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటికే స్కూళ్లను బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జగన్ సూచనల మేరకు మంత్రి ఆళ్లనాని రాష్ట్రంలో థియేటర్లు, మాల్స్ బంద్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ప్రభుత్వం 13 జిల్లాల్లోని ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది. విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన వారు 14 రోజుల పాటు కరోనా లక్షణాలు ఉన్నా లేకపోయినా ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: