కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలని వాయిదా వేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తమని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా ఎన్నికలని వాయిదా వేశారని జగన్ మండిపడ్డారు. ఆ వెంటనే గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టుకు వెళ్లారు. కానీ సుప్రీం ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని సమర్ధించింది.

 

కాకపోతే ఎన్నికల కోడ్ ఎత్తేవేయాలని సుప్రీం సూచించింది. ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందనుకునే లోపే, మరో వివాదం తెరపైకి వచ్చింది. తనకు భద్రత కావాలని ఎన్నికల కమిషనర్ కేంద్రానికి లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, కాస్త ఘాటుగానే ఆ లేఖలో విమర్శలు చేశారు. అయితే ఆ లేఖ రాయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తూ, డి‌జి‌పికి ఫిర్యాదు చేశారు.

 

ఇటు టీడీపీ మాత్రం లేఖలో నిజాలే ఉన్నాయని మాట్లాడింది. అయితే వీరి వాదనలు ఇలా కొనసాగుతుండగానే, నిమ్మగడ్డ లేఖపై  కేంద్రం స్పందించింది. లేఖ అందిందని, నిమ్మగడ్డకు రక్షణ కల్పిస్తున్నామని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సడన్‌గా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని తనకు ఏర్పాటు చేసిన ప్రాంగణం నుండి కార్యాలయ సాధారణ విధులను నిర్వహిస్తున్నట్లు నిమ్మగడ్డ తెలిపారు.

 

ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని గృహ స్థలాల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఎన్నికల కమిషన్ క్లియర్ చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పథకాలను కొనసాగించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని, అందుకు అనుగుణంగా కొనసాగుతున్న పథకమని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిందన్నారు. అయితే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో, ఏపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14కు వాయిదా వేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: