ఈరోజు మధ్యాహ్నం నుంచి విశాఖలో కరోనా బాధితుడు చనిపోయాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఏపీలో తొలి మరణం అంటూ వార్తలు వైరల్ కావడంతో విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ స్పందించారు. బాధితుడు చనిపోయాడంటూ వైరల్ అయిన వార్త అవాస్తవమని ప్రకటన చేశారు. ఎవరైనా కరోనా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. 
 
కలెక్టర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కరోనా బాధితుడి మరణం గురించి వైరల్ అయిన వార్తలపై సీరియస్ అయ్యారు. ఐసోలేషన్ వార్డులో కరోనా బాధితుడికి చికిత్స జరుగుతోందని... అతడు క్షేమంగానే ఉన్నాడని వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 
 
నాలుగు వేల పడకలను నగరంలో క్వారంటైన్ కోసం సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఇంటింటికీ తిరిగి సర్వే చేపడుతున్నామని... ఈ సర్వే కోసం జిల్లాలో 115 బృందాలు పర్యటిస్తున్నాయని అన్నారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో మార్చి 31 వరకు స్కూళ్లు, థియేటర్లు, మాల్స్ మూసివేస్తున్నట్లు ప్రకటన చేశారు. 
 
మరోవైపు మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ప్రజలంతా స్వచ్చందంగా ప్రధాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ పాటించాలని చెప్పారు. విశాఖలోని వివిధ రంగాల ప్రతినిధులతో కరోనాను దృష్టిలో పెట్టుకుని ఆయన సమావేశమయ్యారు. విద్యాసంస్థలు తరగతులను నిర్వహించరాదని... ప్రయాణాలు, పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటే మంచిదని చెప్పారు. సభలు, సమావేశాలకు ప్రజలు దూరంగా ఉంటే మంచిదని అన్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 217కు చేరింది. ఏపీలో ఇప్పటివరకూ 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తెలంగాణలో 18 కేసులు నమోదయ్యాయి. 217 పాజిటివ్ కేసులలో ఐదుగురు మృతి చెందగా 20 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: