కరోనా వైరస్ ప్రభావం ఆక్వా రంగంపై పడింది. ప్రపంచ దేశాలు షట్ డౌన్ అవుతుండటంతో ఎక్స్ పోర్టర్స్ ఆందోళన చెందుతున్నారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా నుండే ఏడాదికి 18 వేల కోట్లకు పైగా ఉత్పత్తులను ఎగుమతి చేస్తుండటంతో ఆక్వా రంగం తీవ్ర ఆందోళనతో బిక్క చచ్చిపోతుంది.


 
పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రంగానికి పెట్టింది పేరు. దాదాపుగా 2లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది. వీటిలో చేపలు లక్షా 30 వేల ఎకరాల్లో సాగు చేస్తుంటే, 70 వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. దాదాపుగా జిల్లా నుండి ఏడాదికి 18వేల కోట్లకు పైనే ఆక్వా సాగుపై ఆదాయం వస్తుంది. ఇప్పుడు కరోనా వైరస్ వల్ల ఆక్వా రంగం కుదేలయ్యే ప్రమాదం కనిపిస్తుంది. మహమ్మారి  వైరస్ ప్రభావం ఇప్పుడు ఎగుమతులపై కూడా పడింది. దీంతో రైతులు, ట్రేడర్లు, ఎగుమతి దారులు తెగ ఇబ్బందిపడిపోతున్నారు.  ఈ కరోనా ప్రభావం రొయ్యల ఎగుమతిపై ఎక్కువగా కనిపిస్తుంది.  

 

మన దేశం నుంచి సంవత్సరానికి 45 వేల కోట్లు రొయ్యల ఎగుమతి వల్ల ఆదాయం వస్తుంది. దీనిలో ఏపీ నుండే 16వేల కోట్లు ఎగుమతులు జరుగుతున్నాయి. వీటిలో దాదాపుగా 10వేల కోట్లకు పైనే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రొయ్యల సాగు, ఎగుమతి వల్ల ఆదాయం వస్తుంది.

 

రొయ్యల సాగు కేజీకి 20 నుండి, 30 ల కౌంట్ రావడంతో మంచి ధర వస్తుందనే ఆనందంలో ఉన్న సమయంలో.. కరోనా వైరస్ వల్ల రొయ్యల్ని కొనే నాథుడే కనిపించడం లేదు. విదేశాలకు భారీగా ఎగుమతులు నిలిచిపోవడంతో  చెరువుల్లోనే ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. 

 

రైతులు పరిస్థితే ఇలా ఉంటే ఇంకా రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసే ట్రేడర్లు తీవ్ర  ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 50 టన్నులకు పైనే కొనడం, అంతా ఎగుమతి కాకుండా నిలిచిపోవడంతో తీవ్రమైన నష్టాలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రయాణికుల విమానాలను ప్రపంచదేశాలు నిలిపివేశాయి. ఆహార ఎగుమతులపై కూడా ఆంక్షలు విధిస్తే, కచ్చితంగా పశ్చిమ ఆక్వా రైతులు ఈ సీజన్లో కోట్లు నష్టపోవాల్సి వస్తుంది.ఇదే ఆక్వా రైతులను ఆందోళనకు గురి చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: