స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన పార్టీలు రాజకీయం చేయడం మాత్రం ఆపలేదు. ఎన్నికలు జరగడానికి ఎక్కువ రోజులు గ్యాప్ రావడంతో పార్టీలు గెలుపుపై వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఇందులో అధికార వైసీపీ మాత్రం, అపోజిషన్ పార్టీ అభ్యర్ధులని పోటీ నుంచి తప్పించే కార్యక్రమం చేస్తోంది. ఈ క్రమంలోనే వెస్ట్ గోదావరిలో ఓ విచిత్రమైన రాజకీయం జరిగింది. ఇటీవల ఆచంట నియోజవర్గంలోని పోడూరు జెడ్‌పి‌టి‌సిగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ధి నడింపల్లి వెంకట శివరామకృష్ణంరాజు సడన్‌గా, పోటీ నుంచి తప్పుకున్నారు.

 

తప్పుకున్న వెంటనే వైసీపీలో చేరిపోయి, వైసీపీ అభ్యర్ధి గుంటూరి పెద్దిరాజుకు మద్ధతు పలికారు. పనిలో పనిగా చంద్రబాబుని విమర్శించాలి కాబట్టి, ఆయన్ని నాలుగు మాటలు అని వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఇక్కడవరకు బాగానే జరిగింది. టీడీపీ అభ్యర్ధి తప్పుకుని, వైసీపీలో చేరి, ఆ పార్టీ అభ్యర్ధికి మద్ధతు ఇచ్చేశారు. దీంతో అక్కడ టీడీపీ తరుపున అభ్యర్ధి లేకుండా పోయారు.

 

అయితే ఆ మండలంలో ఉన్న మిగతా టీడీపీ కార్యకర్తలు ఏమి సైలెంట్‌గా ఉండలేదు. ఎలాగైనా వైసీపీ అభ్యర్ధిని ఓడించాలనే కసితో ఉన్న కార్యకర్తలు, జనసేన అభ్యర్ధి బండారు రాజేశ్‌కు సపోర్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇటు జనసేన అభ్యర్ధి కూడా టీడీపీ మద్ధతు కోరారు. దీంతో పోడూరు మండలంలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం, పార్టీలు ఎవరి రాజకీయం వారు చేశారు.

 

ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో వెస్ట్ గోదావరి జిల్లాలో అన్నీ పార్టీలు ప్రచారానికి బ్రేక్ వేశాయి. కాకపోతే ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునేందుకు, ప్రత్యర్థులను బరి నుంచి తప్పించేందుకు అంతో ఇంతో చేయి తడిపారు. ఇలాంటి తరుణంలోనే ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా పరిస్థితి తిరగబడడంతో అభ్యర్ధులు నీరుగారిపోయారు. ప్రధానంగా వైసీపీ అభ్యర్ధులకు ఎన్నికల వాయిదా పడటం ఇబ్బందికరంగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: